Cricket Record: అరంగేట్రంలోనే ట్రిపుల్ సెంచరీ

రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు.

  • Written By:
  • Updated On - February 19, 2022 / 12:56 PM IST

రంజీ ట్రోఫీ 2022లో భాగంగా మిజోరాంతో జరుగుతున్న మ్యాచ్‌లో బీహార్‌కి చెందిన షకీబుల్ గని విశ్వరూపం చూపించాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిపోయి 405 బంతుల్లో 56ఫోర్లు 2సిక్సులతో 341 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినతొలి మ్యాచ్‌లోనే ట్రిఫుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకున్నాడు.. అంతకు ముందు 2018-2019 రంజీ ట్రోఫీ సీజన్‌లో మధ్య ప్రదేశ్‌ ఆటగాడు అజేయ్‌ రోహరా 267 పరుగులు సాధించాడు.. తాజాగా ఆ రికార్డ్‌ని షకీబుల్ గని 341 పరుగులతో బద్దలు కొట్టాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన షకీబుల్ గని దుమ్మురేపాడు. 229 పరుగులతో డబుల్ సెంచరీ చేసిన బబుల్ కుమార్ తో కలిసి నాలుగో వికెట్‌కి 538 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన షకీబుల్ గని.. బీహార్‌ని పటిష్ట స్థితిలో నిలిపాడు.

ఫలితంగా బీహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌ని 5 వికెట్ల నష్టానికి 686 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన మిజోరాం జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 40 పరుగులతో నిలిచింది. ఇదిలాఉంటే.. రంజీ ట్రోఫీలో ఈ సారి పలు రికార్డులు నమోదవుతున్నాయి. తొలిరోజే యశ్ ధూల్ సెంచరీ నమోదు చేసి అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన ఆటగాడిగా ఘనత సాధించగా.. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో క‌ర్ణాట‌క కెప్టెన్ మ‌నీశ్ పాండే కూడా అదరగొట్టాడు.. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిపోయాడు. 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 156 ప‌రుగులు సాధించాడు. తాజాగా షకీబుల్ గని ట్రిపుల్ సెంచరీతో మరో రికార్డు నమోదైంది.