Gujarat Accident: మోర్బీలో తీగల వంతెన కూలి 91 మంది చనిపోయారు

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్‌ స్టేడ్‌ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.

Published By: HashtagU Telugu Desk
Gujarat Tragedy

Gujarat Tragedy

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం మోర్బీ పట్టణంలో కేబుల్‌ స్టేడ్‌ వంతెన కూలి 91 మంది చనిపోయారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బ్రిడ్జి కూలిపోయే సమయంలో 500 మంది వరకు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అర్థరాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఇప్పటివరకు 91 మంది మరణించారని గుజరాత్ మంత్రి, మోర్చి ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ప్రకటించారు. దాదాపు వందేళ్ల నాటి ఈ వంతెనకు ఇటీవల మరమ్మతులు చేపట్టి గుజరాత్ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26న తిరిగి ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఆదివారం సాయంత్రం వంతెనపై పెద్దఎత్తున జనం నిలబడ్డారని, సామర్థ్యానికి మించి బరువు పెరగడం వల్లే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి సహాయక చర్యలపై మార్గనిర్దేశం చేశారు. వెంటనే మోర్బీకి చేరుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ముఖ్యమంత్రి నిర్ణీత కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని మోర్బీకి వెళ్లి అక్కడి పరిస్థితిని నేరుగా సమీక్షిస్తారని తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రూ. 2 లక్షలు మరియు రూ. 50 వేలు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందజేయనున్నారు.

  Last Updated: 31 Oct 2022, 02:04 AM IST