Site icon HashtagU Telugu

Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ

Night Curfew

Night Curfew

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.

ఇప్పటికే మధ్యప్రదేశ్ తమ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి నుండి ఉదయం వరకు నిర్ణిత సమయాల్లో ప్రజలు బయటకి రావొద్దని వస్తే కేసులు పెడుతామని హెచ్చరించింది. మధ్యప్రదేశ్ బాటలోనే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు, ఇక బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువమంది కలిసి ఉండకూడదని సూచించింది. సినిమా హాళ్లు, హోటళ్లు, పబ్స్, జిమ్స్ 50% ఆక్యుపెన్సీ తో నడుపుకోవచ్చని, క్లోజ్డ్ ఫంక్షన్స్ 100 మందితో, ఓపెన్ ఫంక్షన్స్ 250 మందితో నిర్వహించుకోవచ్చని తెలిపింది.

ఉత్తరప్రదేశ్ లో కూడా నైట్ కర్ఫ్యూ అమలుచేశారు. డిసెంబర్ 25 నుండి రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని, 200 మందికి మించకుండా ఫంక్షన్స్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

గుజరాత్ రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ నెలాఖరు వరకు రాత్రి పూట కర్ఫ్యూని పొడిగించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 వరకు రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేయనున్నారు. అహ్మదాబాద్, రాజ్ కోట్, సూరత్, గాంధీనగర్, జామ్ నగర్, భవ్ నగర్, జునాగఢ్ లలో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. 75 శాతం సామర్థ్యంతో రెస్టారెంట్లు, 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు పని చేసేందుకు అనుమతినిచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై కేజ్రీవాల్ ప్రభుత్వం నిషేధం విధించింది. వేడుకలను సామూహికంగా జరుపుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లు ధరించని వారిని అనుమతించవద్దని వాణిజ్య సంస్థలకు సూచించింది. బార్ లు, రెస్టారెంట్ లలో 50 సిటింగ్ సామర్థ్యంతో అనుమతించనున్నారు. వివాహాలు, అంత్యక్రియలకు మాత్రం 200 మందికంటే అధికంగా ఉండొద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయి.

హర్యానా, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం రాత్రిపూట కర్ఫ్యూ అమలుచేస్తున్నారు. ఇక తెలంగాణలో న్యూ ఈయర్ వేడుకలపై నిషేధం లేదా ఆంక్షలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.