Moon and Earth: భూమి నీటిని దోచేస్తున్న చంద్రుడు

చంద్రుడిపై నీటి జాడ ఉందా ? అంటే.. ' ఉంది ' అని 2008 సంవత్సరంలోనే భారతదేశ 'చంద్రయాన్' మిషన్ గుర్తించింది.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 07:30 PM IST

చంద్రుడిపై నీటి జాడ ఉందా ? అంటే.. ‘ ఉంది ‘ అని 2008 సంవత్సరంలోనే భారతదేశ ‘చంద్రయాన్’ మిషన్ గుర్తించింది. మరి చందమామ పైకి నీరు ఎలా చేరింది ? ఎక్కడి నుంచి చేరింది ? అనే ప్రశ్నలకు 14 ఏళ్ల తర్వాత ఆసక్తికర సమాధానం లభించింది. ఆ నీళ్లు మన భూమివేనని వెల్లడైంది. భూమిపై 7 రకాల వాతావరణ పొరలు ఉంటాయి. భూవాతావరణానికి అత్యంత ఎగువన ఉండే ‘ మ్యాగ్నేటో స్పియర్ ‘ అనే వాతావరణ పొర మీదుగా మన భూమికి చెందిన నీరు చంద్రుడిపైకి రవాణా అవుతోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్ బ్యాంక్స్ జియో ఫిజికల్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు.

భూమిపై ఉండే నీరు.. చంద్రుడిపైకి ఇలా

చంద్రుడి ఉత్తర, దక్షిణ ధృవాలపై దాదాపు 3500 క్యూబిక్ కిలోమీటర్ల పరిధిలో నీటి నిల్వలు విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ మన భూమి నుంచి చంద్రుడు దొంగిలించి దాచుకున్నవే అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి నెలా 5 రోజుల పాటు చంద్రుడు .. మన భూమికి అత్యంత ఎగువన ఉండే ‘మ్యాగ్నేటో స్పియర్ ‘ అనే వాతావరణ పొరకు దగ్గరగా వస్తుంటాడు. ఈ సమయంలోనే అసలు కథ మొదలు అవుతోంది. సూర్యుడి సౌర తుఫానుల నుంచి భూమికి రక్షణ కల్పించడంలో ‘ మ్యాగ్నేటో స్పియర్ ‘ కీలక పాత్ర పోషిస్తుంది. చంద్రుడు , భూమికి అత్యంత చేరువగా వచ్చినప్పుడు ‘మ్యాగ్నేటో స్పియర్ ‘ లోని అయస్కాంత క్షేత్రం యాక్టివ్ అవుతుంది. దీంతో మ్యాగ్నేటో స్పియర్ శివార్లలో తేలియాడే హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు .. చంద్రుడి ఉపరితలం దిశగా దూసుకెళ్తాయి. అలా చంద్రుడి వైపు వెళ్లే హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్ల లో కేవలం 1 శాతమే చంద్రుడిని చేరుతాయి. మిగిలిన 99 శాతం హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు తిరిగి మ్యాగ్నేటో స్పియర్ వైపు వర్షంలా కురుస్తూ వెనక్కి వచ్చేస్తాయి. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్ లో ప్రచురితమైంది. చంద్రుడి పై నీటిజాడలు ఉన్నాయనే విషయం.. శాస్త్ర ప్రపంచానికి ఆశలు రేకెత్తించే అంశం. భవిష్యత్ లో చంద్రుడి పై ఏర్పాటు చేయబోయే మానవ కాలనీలకు.. అక్కడ నీటి నిల్వలు ఉన్న ప్రదేశాలు బేస్ క్యాంప్ లుగా మారనున్నాయి.