Site icon HashtagU Telugu

Odisha : మరో ఐదు రోజుల్లో ఒడిశాను తాక‌నున్న రుతుపవనాలు

1016078 Dr

rain

నైరుతి రుతుపవనాలు రాబోయే నాలుగైదు రోజుల్లో ఒడిశాకు వచ్చే అవకాశం ఉంది. దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుప‌వ‌నాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ వాతావరణ సూచనల ప్రకారం.. రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మరఠ్వాడాలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఈ కాలంలో పురోగమిస్తాయి. ఒడిశా వైపు రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భువనేశ్వర్‌ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు. పశ్చిమ గాలులు బలహీనపడ్డాయని.. రాష్ట్రంలో తేమ లభ్యత ఉందన్నారు. . శనివారం నుంచి ప్రీ మాన్‌సూన్‌ షవర్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఉమాశంకర్‌ దాస్‌ తెలిపారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రోజులో తొమ్మిది ప్రదేశాలలో 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సుందర్‌ఘర్‌లో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. జంటనగరాలైన భువనేశ్వర్‌, కటక్‌లలో శనివారం మేఘావృతమైన వాతావరణం నెలకొంది. అయితే ఆదివారం బారాబతి స్టేడియంలో దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో భారత్ ఢీకొననున్న తరుణంలో వర్షాలు కురుస్తాయని క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రాంతీయ వాతావరణ కార్యాలయం తెలిపింది.

మరోవైపు రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం కోరాపుట్, మల్కన్‌గిరి, నబరంగ్‌పూర్, రాయగడ, నువాపడ, కలహండి, కంధమాల్, బలంగీర్, కియోంజర్, మయూర్‌భంజ్ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి 8 వరకు రాష్ట్రంలో 76 శాతం లోటు వర్షపాతం నమోదైంది