Monkey Pox: జాగ్రత్త.. మంకీపాక్స్ విరుచుకుపడుతోంది..!

మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఖండాలు దాటి వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు 11 దేశాలకు పాకింది.

  • Written By:
  • Publish Date - May 22, 2022 / 07:30 PM IST

మంకీపాక్స్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఖండాలు దాటి వ్యాపిస్తుండడంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు 11 దేశాలకు పాకింది. అత్యధికంగా స్పెయిన్లో 23 కేసులు, బ్రిటన్లో 20 కేసులు నమోదయ్యాయి. వరల్డ్ వైడ్ గా 80కి పైగా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మంకీపాక్స్ వ్యాప్తి వేగంగా ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు స్పెయిన్, బ్రిటన్ సహా.. పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికా, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

మంకీపాక్స్ సోకిన వారిలో ఒంటిపై దద్దుర్లు వస్తాయి. జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు విపరీతంగా ఉంటాయి. ఈ లక్షణాలు 2 వారాల నుంచి 4 వారాల వరకు ఉంటాయి. మంకీపాక్స్ వేగంగా పాకుతున్నప్పటికీ.. దీనిలో మరణాల శాతం కాస్త తక్కువ. పది మందికి వైరస్ సోకితే ఒకరు చనిపోతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.

మంకీపాక్స్ వైరస్ ను 1958లో కోతుల్లో కనుగొన్నారు. అప్పటి నుంచి దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. అయితే మనుషుల్లో తొలిసారిగా కనిపించింది మాత్రం 1970లోనే. నిన్న మొన్నటి వరకు ఈ వైరస్ కేవలం ఆఫ్రికాలోనే కనిపించింది. ఇప్పుడు ప్రపంచానికి పాకుతోంది. మంకీపాక్స్ వచ్చిన వ్యక్తి రక్తం, శరీర స్రావాలు, తుంపర్లు పడినా ఈ వైరస్ సోకుతుంది. ఈ మధ్య లైంగిక సంపర్కం వల్ల కూడా వ్యాప్తిచెందుతోందని తేలింది. బ్రిటన్ కు మొదటి కేసు ఓ యువకుడి ద్వారా వచ్చింది. మరో మగాడితో స్వలింగ సంపర్కం చేయడంతో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. స్పెయిన్, పోర్చుగల్లో కూడా యువకులకే ఈ వ్యాధి సోకింది. వీళ్లు కూడా ఇతర మగాళ్లతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దీనికి ప్రత్యేకమైన టీకాలు లేనప్పటికీ.. మశూచి టీకాలనే వాడుతున్నారు. ఈ టీకాలు మంకీపాక్స్ వైరస్ను సమర్ధంగా
ఎదుర్కొంటున్నాయని పరిశోధనలో తేలింది.