Modi Cabinet-New Faces : 2021లో కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది.
మళ్ళీ ఇప్పుడు జరగబోతోంది..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ జరగనున్న కేంద్ర మంత్రి మండలి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
వచ్చే లోక్ సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రధాని మోడీ కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రేసులో సోయం బాపురావు, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ పేర్లు ముందంజలో ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి ఒకరు, ఛత్తీస్‌గఢ్ నుంచి ఒకరు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు లేదా ముగ్గురు, బీహార్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు బీజేపీ ఎంపీలకు మంత్రి పదవులు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్న బీజేపీ మిత్రపక్ష నేతల లిస్టులో ప్రఫుల్ పటేల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ), చిరాగ్ పాశ్వాన్ (లోక్ జనశక్తి పార్టీకి చెందిన రామ్ విలాస్ వర్గానికి చీఫ్), ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది.
Also read : YS Sharmila: త్వరలోనే కాంగ్రెస్ లోకి షర్మిల: వైఎస్ఆర్ ఆప్తుడు కేవీపీ
బీజేపీ సీనియర్ నేతలు సిటి రవి, జనార్దన్ సింగ్ సిగ్రివాల్, వివేక్ ఠాకూర్, సిఆర్ పాటిల్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సురేష్ గోపిలు కేంద్ర కేబినెట్‌లోకి వస్తారని భావిస్తున్నారు. మొత్తం మీద దాదాపు 15 కొత్త ముఖాలకు కేంద్ర క్యాబినెట్ లో(Modi Cabinet-New Faces) చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ ల సేవలను ఇక నుంచి 2024 ఎన్నికలు టార్గెట్ గా బీజేపీ బలోపేతం కోసం వాడుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. యూపీ, బెంగాల్, బీహార్, గుజరాత్ కు చెందిన కేంద్ర మంత్రుల సంఖ్యను తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఈక్రమంలో గుజరాత్ కు చెందిన కేంద్ర మంత్రులు దర్శన జర్దోష్, పురుషోత్తం రూపాలా, మన్సుఖ్ మాండవ్యలను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.
కేబినెట్‌లో ఎంతమంది మంత్రులు ఉండొచ్చు?
నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రితో కలిపి మొత్తం 81 మంది మంత్రులుగా ఉంటారు. ప్రస్తుతం కేబినెట్‌లో 78 మంది మంత్రులు ఉండగా 3 స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. గత(2021) మంత్రివర్గ విస్తరణలో 12 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఆ సమయంలో 36 మంది కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా, 7 మంది మంత్రులకు పదోన్నతులు లభించాయి.