Mithila Raj: సచిన్ రికార్డు సమం చేసిన మిథాలీ

భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా సచిన్ పేరు చెబితే...మహిళల క్రికెట్ లో ఈ ఘనత హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ కే దక్కుతుంది. మిథాలీని మహిళల క్రికెట్ లో సచిన్ గా అభివర్ణిస్తారు.

  • Written By:
  • Publish Date - March 6, 2022 / 10:36 AM IST

భారత క్రికెట్ లో రికార్డుల రారాజుగా సచిన్ పేరు చెబితే…మహిళల క్రికెట్ లో ఈ ఘనత హైదరాబాదీ ప్లేయర్ మిథాలీ రాజ్ కే దక్కుతుంది. మిథాలీని మహిళల క్రికెట్ లో సచిన్ గా అభివర్ణిస్తారు. సుదీర్ఘ కెరీర్ లో ఈ హైదరాబాదీ ప్లేయర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.తాజాగా వరల్డ్ కప్ లో మరో రికార్డును అందుకుంది. అత్యధిక సార్లు ప్రపంచ కప్ ఆడిన భారత మహిళా క్రికెటర్ గా రికార్డులకెక్కింది.

పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా ఆమె ఈ ఘనత సాధించింది. ఇప్పటి వరకు సచిన్ మాత్రమే భారత్ నుంచి ఆరు ప్రపంచ కప్ లు ఆడిన ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. టెండూల్కర్ 1992, 1996, 1999, 2003, 2007, 2011 వరల్డ్ కప్ లు ఆడాడు.
తాజాగా మిథాలీ సచిన్ రికార్డును సమం చేసింది. మిథాలీ రాజ్ 2000, 2005, 2009, 2013, 2017, 2022 లలో ప్రాతినిధ్యం వహించింది. అలాగే ప్రపంచ మహిళల క్రికెట్ లో అయిదు సార్లు వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ హాక్లే , ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ లను మిథాలీ అధిగమించింది.

కాగా ప్రపంచ కప్ కు ముందు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ ఈ హైదరాబాదీ ప్లేయర్ పలు రికార్డులు క్రియేట్ చేసింది. కెప్టెన్ గా మిథాలీ రాజ్ 50 సార్లు వన్డేల్లో 50 పరుగులకు పైగా ఇన్నింగ్సులు ఆడింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌ మిథాలీనే.

ఇక, మెన్స్ క్రికెట్ లోనూ ఈ రికార్డును కేవలం ఇద్దరు క్రికెటర్లు మాత్రమే చేయగలిగారు.ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ మరియు భారత్‌కు చెందిన ఎంఎస్ ధోనీ వన్డేల్లో 50 సార్లు కెప్టెన్‌గా 50కి పైగా పరుగులు చేశారు. పాంటింగ్ ఈ ఫీట్ 73 సార్లు చేయగా, ధోనీ 53 సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక, విరాట్ కోహ్లీ 48 సార్లు ఈ ఘనత సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 40 ఏళ్ల వ‌య‌సులోనూ అద‌ర‌గొడుతున్న మిథాలీరాజ్‌ ఈ వరల్డ్ కప్ గెలిచి కెరీర్ ను ఘనంగా ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.