Site icon HashtagU Telugu

Radioactive Capsule: మిస్సైన రేడియో ధార్మిక క్యాప్సూల్‌ ఆచూకీ లభ్యం!

Radioactive Capsule

Radio

ఆస్ట్రేలియాలో కొద్దిరోజుల కిందట గల్లంతైన రేడియో ధార్మిక క్యాప్సూల్‌ (Radioactive Capsule) దొరికింది. మైనింగ్‌ పట్టణం న్యూమాన్‌కు సమీపంలో గ్రేట్‌ నార్తర్న్‌ హైవేపై ఇది కనిపించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.గత నెలలో ఎడారిలోని ఒక గని నుంచి పెర్త్‌ నగరానికి ట్రక్కులో రవాణా చేస్తున్న సమయంలో ఇది గల్లంతైంది. ఈ వాహనం బయల్దేరిన ప్రదేశం నుంచి గమ్యస్థానం మధ్య 1400 కిలోమీటర్ల దూరం ఉంది. దీంతో ఆ మార్గంలో గాలింపు మొదలైంది. ఇందుకోసం ప్రత్యేక గాలింపు వాహనాన్ని రప్పించారు. ఇది రహదారి వెంబడి గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఆధునిక పరికరాలతో అన్వేషణ చేపట్టింది.

ఇందులోని ఉపకరణాలు.. రేడియో ధార్మికతను (Radioactive Capsule) పసిగట్టాయి. దీంతో సంబంధిత ప్రాంతంలో అధికారులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఇందుకోసం చిన్నపాటి పరికరాలను ఉపయోగించారు. రోడ్డు పక్కన 2 మీటర్ల దూరంలో క్యాప్సూల్‌ను గుర్తించారు. దీని పొడవు 8 మిల్లీమీటర్లు కాగా వెడల్పు 6 మిల్లీమీటర్లు. ఈ సాధనం దగ్గర్లోకి ఎవరూ రాలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. సీజియం-137 నుంచి వెలువడే రేడియో ధార్మికత ప్రమాదకరం. దీనివల్ల చర్మం కాలుతుంది. దీని తాకిడికి గురైతే క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంది. ఈ క్యాప్సూల్‌ గల్లంతు కావడంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:  TTD Mobile App: టీటీడీ మొబైల్ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి