Orissa Firing: కాల్పుల్లో గాయపడిన మంత్రి నబకిశోర్ మృతి

ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి మీద ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపగా..

Published By: HashtagU Telugu Desk
2023 1$largeimg 1071611139

2023 1$largeimg 1071611139

Orissa Firing: ఒడిశాలో విషాదం చోటుచేసుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన ఆరోగ్యశాఖ మంత్రి మీద ఓ పోలీస్ అధికారి కాల్పులు జరపగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఒడిశా మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్ దాస్.. ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. గోపాల్ దాస్ అనే పోలీస్ అధికారి చాలా దగ్గరి నుండి కాల్పులు జరిపాడు. దీంతో అతడిని కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న నబకిశోర్ దాస్.. ఆదివారం జర్సుగూడ జిల్లాలోని బ్రజరాజ్ సమీపంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానిక గాంధీ చౌక్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కారు దిగుతుండగా.. అతడి మీదకు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ దాస్ చాలా దగ్గరి నుండి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో మంత్రి ఛాతిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి.

మంత్రిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ కి మెరుగైన వైద్యం కోసం తరలించారు. కాగా ఈ కాల్పుల ఘనటపై సబ్ డివిజనల్ పోలీస్ అధికారి గుప్తేశ్వర్ భోయ్ మీడియాకు వివరిస్తూ.. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ దాస్ కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. అయితే గోపాల్ దాస్ మంత్రి మీద ఎందుకు కాల్పులు జరిపారనే విషయాలు మాత్రం తెలియరాలేదు.

కాగా చాలాకాలంగా బిజూ జనతాదళ్ పార్టీ కోసం పని చేస్తున్న నబకిశోర్.. ఆమధ్యన మహారాష్ట్రలోని శని శింగణాపూర్ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇవ్వడంతో ఆయన వార్తల్లో నిలిచాడు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒడిశాలో హింసాత్మక ఘటనలు జరగడం మామూలే అని అక్కడి నేతలు చెబుతుండగా.. మంత్రిని అది కూడా పోలీసు అధికారులు కాల్చి చంపడం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

  Last Updated: 29 Jan 2023, 10:08 PM IST