ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తారు.
ఈ నేపధ్యంలో అక్కడి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఇతర వైసీపీ నేతలు, అధికారులు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి పలువరు నేతలు నివాళుర్పించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్కక్రియలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువరు మంత్రులు, ఇతర రాజకీయనాయకులు హాజరుకానున్నారు.