Site icon HashtagU Telugu

KTR : మ‌రో సారి గొప్ప మ‌న‌సు చాటుకున్న కేటీఆర్‌..

Ktr Hockey

Ktr Hockey

సొంత రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్ర‌మూ కాదు. ఎక్క‌డో పంజాబ్‌. ప్ర‌తిభ కావాల్సినంత ఉంది. అయినా అక్క‌డి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోతే మ‌న ఐటీ శాఖ మంత్రి ఆమెను గుర్తించారు. ఎవ‌రూ చేయ‌ని సాయం చేశారు. నేనున్నానంటూ భ‌రోసా ఇచ్చారు.

పంజాబ్ రాష్ట్రానికి చెందిన డిఫ‌రెంట్లీ ఏబుల్డ్ చెస్ ప్లేయ‌ర్ మ‌లికా హండాకు త‌న వంతుగా సాయం అందించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌. త‌న కుటుంబ స‌భ్యుల‌తో కేటీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోమ‌వారం క‌లిశారు మ‌లికా. ఈ సంద‌ర్భంగా ఆమెకు కేటీఆర్ రూ. 15 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేయ‌డంతో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా బ‌హుక‌రించారు. మ‌లికాకు ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పించాల‌ని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కేటీఆర్ కోరారు. మంత్రి కేటీఆర్‌కు మ‌లికాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.మ‌లికా హండా.. బధిర చెస్‌ ప్లేయర్‌. పంజాబ్‌కు చెందిన మలిక పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నది. అయితే వైకల్యం తన శరీరానికే కానీ ప్రతిభకు కాదని ఘనంగా చాటిచెప్పింది. కెరీర్‌లో ఇప్పటి వరకు ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సహా నాలుగు రజతాలతో మెరిసింది.


అంతటితో ఆగకుండా జాతీయ బధిర చెస్‌ చాంపియన్‌షిప్‌లో ఏకంగా ఏడుసార్లు పసిడి పతకం కైవసం చేసుకుంది.ఇలా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఈ 26 ఏండ్ల చెస్‌ ప్లేయర్‌ లెక్కకు మించి పతకాలు కైవసం చేసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. తన సొంత రాష్ట్రం పంజాబ్‌ నుంచి ఆమెకు సరైన ప్రోత్సాహం కరువైంది. అద్భుత ప్రదర్శన కనబరిచే మాలికను పంజాబ్‌ సర్కార్‌ కనీసం పట్టించుకున్నది లేదు. దీంతో విసిగివేసారిన మలిక..తన ఆక్రోశాన్ని ట్విటర్‌ వేదికగా వెళ్ల‌గక్కింది. బధిర ప్లేయర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు తమ పాలసీలో లేవన్న ఆ రాష్ట్ర క్రీడా మంత్రి పర్గత్‌సింగ్‌ను లక్ష్యంగా చేసుకుంటూ తన కోపాన్ని వ్యక్తపరిచింది.

అయితే తన దృష్టికి వచ్చిన ఈ ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో స్పందించారు. మలికకు సంబంధించి వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. మంత్రి కార్యాలయ సిబ్బంది మలిక కుటుంబ సభ్యులను వెంటనే సంప్రదించారు. తమ కూతురుకు మంత్రి కేటీఆర్‌ సాయం అందించేందుకు ముందుకు రావడంపై కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సునీతాకృష్ణన్‌ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ దివ్యాంగ చాంపియన్ల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీ రూపొందించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతూ మరో ట్వీట్‌ చేశారు.

Exit mobile version