కాంగ్రెస్ – బిఆర్ఎస్ (congress -brs) మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతుంది. నిన్న నల్గొండ రైతు సభలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy ) ఘాటుగా స్పందించారు. కేటీఆర్, హరీశ్ రావు లు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. కెసిఆర్ అల్లుడిగా, కొడుకుగా వాళ్లిద్దరూ నాయకులు అయ్యారని వ్యాఖ్యానించారు.
అసలు కేటీఆర్ ఏమన్నారంటే..
కాంగ్రెస్ పాలనలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ (Mahatma Gandhi University) లో విద్యార్థులు గొడ్డు కారంతో అన్నం తినాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఐటీ టవర్ కళ తప్పిందని విమర్శించారు. తన రాక సందర్భంగా నల్లగొండ ప్రజల ఆదరణ చూస్తుంటే.. తాను రైతు ధర్నాకు వచ్చినట్లు లేదని, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్లు ఉందని అన్నారు. ఇదే సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నీకు సిగ్గుందా వెంకటరెడ్డీ? భూపాల్ రెడ్డిపై పోలీసులతో దాడి చేయిస్తావా? నీకు దమ్ముంటే నల్గొండ గడియారం సెంటర్కి రా. మాలాగే మీటింగ్ పెట్టు. ప్రజలకు మీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు. ఉత్తమ్, వెంకటరెడ్డికి ఆకారాలు, అహంకారాలు పెరిగాయి తప్ప వారు నల్గొండకు చేసిందేమీ లేదు’ అని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. కేటీఆర్, హరీశ్ రావు లు తన కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. కెసిఆర్ అల్లుడిగా, కొడుకుగా వాళ్లిద్దరూ నాయకులు అయ్యారని వ్యాఖ్యానించారు. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తెలంగాణ కోసం, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాటం చేశారని అన్నారు. బండి సంజయ్ కంటే ముందు నుంచే గద్దర్ ఉద్యమంలో ఉన్నారని పేర్కొన్నారు.