Site icon HashtagU Telugu

Kodali Nani : అందుకే చంద్ర‌బాబుకి కడుపు మంట – మంత్రి కొడాలి

పేద ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అండ‌గా ఉన్నార‌నే చంద్ర‌బాబుకి ఆయ‌న బ్యాచ్ కి క‌డుపుమంట‌గా ఉంద‌ని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఓటిఎస్ ప‌థ‌కంపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని.. పేద‌ల‌కు సొంత ఇల్లు ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ స్కీము పెడితే ఎల్లో మీడియాతో చంద్ర‌బాబు అస‌త్య‌ప్ర‌చారాలు చేయిస్తున్నార‌ని మంత్రి కొడాలి నాని ధ్వ‌జ‌మెత్తారు. సీఎం జగన్ పేదల రక్తం పీల్చేస్తున్నారంటూ విషం కక్కే కార్యక్రమాలు చేస్తున్నార‌ని… చంద్రబాబుకు వంత పాడే చెత్త పేపర్లు, డబ్బా మీడియా రోజూ విషం కక్కుతున్నా జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఒక్క శాతం కూడా తగ్గించలేరన్నారు.

వన్ టైం సెటిల్ మెంటు స్కీం వల్ల దాదాపు 50 లక్షల మంది పేదలు సొంత ఇంటికి యజమానులు అవుతార‌ని.. దీంతో ఆ కుటుంబాల వారంతా జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటారు అనే కడుపు మంటతోనే చంద్రబాబు, ఆయనకు వంత పాడే మీడియా దీనిపై బురదజల్లాలని చూస్తుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే, ఆయన్ను అడ్డం పెట్టుకుని బతకడానికి అలవాటు పడ్డ వారి అనుకూల మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తుందన్నారు. ఈ స్కీము వల్ల జగన్ ఏమైనా నష్టం జరిగేటట్టు అయితే.. ఈ చెత్త మీడియా తడిగుడ్డ వేసుకుని నిద్రపోతూ ఇంకా ప్రోత్సహించేవారని కొడాలి నాని అన్నారు.

ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది ఓటీఎస్ స్కీములో కట్టి ఇళ్ళు సొంతం చేసుకోవటానికి ముందుకొచ్చారని.. తణుకులో సీఎం జగన్ చేతుల మీదుగా రేపు లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతుందన్నారు. చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలికే దుర్మార్గులు, దుష్టుల మాటలు నమ్మకుండా, జగన్ పేదల మేలు కోసం చేస్తోన్న ఓటీఎస్ స్కీమును వినియోగించుకోవాలని కోరుతున్నానని కొడాలి నాని తెలిపారు.

Exit mobile version