తెలంగాణలో ఈరోజు నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో తొలిరోజే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ క్రమంలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంమత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడవ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతునట్లు హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ను రూపొందించామని, ముఖ్యంగా మానవీయ కోణంలో బడ్జెట్ ను రూపొందించామని, బడ్జెట్ సర్వజనామోదం పొందుతుందని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పాత పథకాలకు నిధులు కేటాయించడంతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతూ వచ్చే ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమవుతున్నారు. ప్రధానంగా రైతులు, దళితులు, బీసీ, మైనారిటీల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఈ బడ్జెట్ ఉండబోతుందని సమాచారం.
