Winter: తెలంగాణపై చలి పంజా, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 05:57 PM IST

Winter: తెలంగాణ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సిర్పూర్, అసిఫాబాద్ లలో 6.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలంగాణ వెదర్ మేన్ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత వున్నట్లు పేర్కొన్నారు. తీవ్రమైన చలిగాలులకి కారణం… తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తుండటమే కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రంలో చలిగాలులు మరింత ఎక్కువగా వీచే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి ఎక్కువగా ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో గడిచిన 24 గంటల్లో సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ జిల్లా బేలలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్‌ (యూ)లో 10.4, నిర్మల్‌ జిల్లా పెంబిలో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, మంచిర్యాల జిల్లా భీమినిలో 14.8గా ఉన్నది.