Site icon HashtagU Telugu

White House: ప్రధాని కోసం శ్వేత సౌధంలో చిరుధాన్యాలతో వంటకాలు?

White House

White House

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరుధాన్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. మార్చి నెలలో చిరుధాన్యాల సదస్సును ప్రారంభించారు నరేంద్ర మోడీ. మొదట భారతదేశంలో మొదలుపెట్టిన ఈ చిరుధాన్యాల సదస్సును నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెమ్మదిగా ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతోంది. ఇక ఈ ప్రయత్నానికి అమెరికా తొలి మహిళ జిల్‌ బైడెన్‌ స్పందించారు.

కాగా నేడు శ్వేత సౌధంలో నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన అధికారిక విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలను కూడా ఏర్పాటు చేశారు. ఆమె గెస్ట్‌ చెఫ్‌ నీనా కుర్టిస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు శ్వేత సౌధం ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ క్రిస్‌ తాజాగా వెల్లడించారు. అయితే ఈ అధికారిక విందుకు సంబంధించిన మెనూను శ్వేతసౌధం పేస్ట్రీ చెఫ్‌ సుసీ మారిసన్‌ తయారు చేశారు. విందులో ఫస్ట్‌కోర్స్‌లో.. మారినేటెడ్‌ మిల్లెట్‌, గ్రిల్డ్‌ కార్న్‌ కెర్నల్‌ సలాడ్‌, పుచ్చకాయ, అవకాడో సాస్‌ అందించనున్నారు.

అలాగే మెయిన్‌ కోర్స్‌లో స్టఫ్డ్‌ పోర్టబెల్లో మష్రూమ్స్‌, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమెన్‌ దిల్‌ యోగర్ట్‌ సాస్‌, క్రిస్ప్‌డ్‌ మిల్లెట్‌ కేక్స్‌, వేసవి పానీయాలు కూడా అందులో ఉన్నాయి. కాగా ప్రధాని మోదీ మార్చిలో చిరుధాన్యాల సదస్సును భారత్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యవసాయంలో రసాయనాల కారణంగా సమస్యలు వస్తున్నాయని వాటికి శ్రీఅన్న పరిష్కారం చూపుతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఐరాస కూడా 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.