న్యూయార్క్ మహిళపై మైక్ టైసన్ అత్యాచారం.. 5 మిలియన్ల దావా!

ఆయన రింగ్ లో దిగాడంటే అవతల ఉన్నది ఎంత పెద్ద బాక్సర్ అయినా ఒకే ఒక్క దెబ్బతో నాకౌట్ కావాల్సిందే.

  • Written By:
  • Updated On - January 25, 2023 / 10:52 PM IST

ఆయన రింగ్ లో దిగాడంటే అవతల ఉన్నది ఎంత పెద్ద బాక్సర్ అయినా ఒకే ఒక్క దెబ్బతో నాకౌట్ కావాల్సిందే. వరుసగా మూడు సంవత్సరాల పాటు ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఉన్న మైక్ టైసన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కఠోర శ్రమ, రింగ్ లో దిగితే గెలిచే వరకు వెనుదిరగని నైజం కలిగిన మైక్ టైసన్.. రింగ్ బయట ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

బాక్సింగ్ ను ప్రేమించే వారి ఆరాధ్య దేవుడిగా మైక్ టైసన్ ఉండగా.. అతడి మీద అత్యాచారం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఓసారి అత్యాచారం కేసులో అతడు దోషిగా నిరూపించబడి ఏకంగా మూడు సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని మైక్ టైసన్ అనుభవించి వచ్చాడు. తాజాగా మరోసారి మైక్ టైనస్ మీద అత్యాచారం ఆరోపణలు మోపబడ్డాయి.

ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ 1990లో మొదట్లో తన మీద అత్యాచారం చేసినట్లు న్యూయార్క్ మహిళ ఆరోపించింది. న్యూయార్క్ ఆల్బనీలోని ఓ నైట్ క్లబ్ లో తనపై అత్యాచారం జరిగిందని, దాని తర్వాత తాను శారీరకంగా, మానసికంగా ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో మనోవేదనకు గురైనట్లు ఆమె తెలిపింది. అయితే తన మీద అత్యాచారం ఎప్పుడు జరిగిందనే తేదీ విషయంలో మాత్రం ఆమె స్పష్టత ఇవ్వలేకపోయింది.

మైక్ టైసన్ కు వ్యతిరేకంగా దావా వేసిన న్యూయార్క్ మహిళ.. అతడి నుండి ఏకంగా 5మిలియన్ల కోసం కోర్టు కెక్కింది. దీంతో మరోసారి మైక్ టైసన్ వార్తల్లో నిలిచాడు. 1987 నుండి 1990 వరకు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఉన్న మైక్ టైసన్.. 1980 చివర్లో నటి రాబిన్ గీవెన్స్ తో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకే వీరికి విడాకులు కాగా.. విడాకుల సమయంలో గీవెన్స్ తన వైవాహిక జీవితం హింసతో సాగిందని వివరించింది.

ఆ తర్వాత ఇండియానాపొలిస్ లో దేసిరీ వాషింగ్టన్ అనే మోడల్ మైక్ టైసన్ మీద అత్యాచారం కేసు పెట్టగా.. ఆ కేసులో 1992 ఫిబ్రవరి 2న మైక్ టైసన్ ను కోర్టు దోషిగా తేల్చింది. కోర్టు మైక్ టైసన్ ను దోషిగా తేల్చడంతో పాటు అతడికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. తాజాగా మరోసారి మైక్ టైసన్ మీద అత్యాచారం కేసు నమోదవడంతో.. పాత విషయాలు బయటపడుతున్నాయి.