Google Vs Satya Nadella : సెర్చ్ ఇంజిన్ వ్యాపారంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థి కంపెనీల ఎదుగుదలను కష్టతరం చేస్తోందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆరోపించారు. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’ ఆర్కైవల్ వ్యాపార పద్ధతులను గూగుల్ తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ‘‘మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ 2009 నుంచి మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ యాపిల్‌తో మా కంపెనీ ఒప్పందం రద్దవడం వల్ల గూగుల్ తో పోటీపడలేని పరిస్థితి ఏర్పడింది’’ అని పేర్కొన్నారు. ‘గూగుల్ తీరును మీరు పాపులర్ అని పిలవవచ్చు.. కానీ నాకు ఇది ఆధిపత్యంలా కనిపిస్తోంది’ అని సత్య నాదెళ్ల కామెంట్ చేశారు. ఆన్‌లైన్ సెర్చ్ లో గూగుల్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ చేపట్టిన విచారణకు సత్య నాదెళ్ల స్వయంగా వాషింగ్టన్ డీసీ కోర్టులో హాజరై సాక్ష్యం ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join
‘ఏదైనా సెర్చ్ ఇంజన్ సక్సెస్ కావాలంటే దాని డిస్ట్రిబ్యూషన్ ఎక్కువగా జరగాలి. స్మార్ట్ ఫోన్లలో డీఫాల్ట్ బ్రౌజర్ గా ఉండటం వల్ల అది సాధ్యమవుతుంది. ఐఫోన్‌లో డీఫాల్ట్‌గా ‘బింగ్’(మైక్రోసాఫ్ట్) సెర్చ్ ఇంజన్ ను వినియోగించేందు కోసం యాపిల్‌కు భారీగా చెల్లించేందుకు మా కంపెనీ (మైక్రోసాఫ్ట్) సిద్ధంగానే ఉంది. కానీ యాపిల్ కంపెనీ గూగుల్ తో మాత్రమే జట్టు కడుతామని అంటోంది. దీనివల్ల సెర్చ్ ఇంజన్ మార్కెట్లో గూగుల్ ఆధిపత్యం కొనసాగుతోంది’ అని సత్య నాదెళ్ల స్పష్టం చేశారు. సెర్చ్ ఇంజన్ వ్యాపారంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు యాపిల్ తో కుమ్మక్కయిందని గతంలో ఆరోపణలు వచ్చాయి. Google తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి యాపిల్, ఇతర సంస్థలకు చట్టవిరుద్ధంగా బిలియన్ల కొద్దీ డాలర్లను చెల్లించిందని అంటారు. ఈనేపథ్యంలో ఇప్పుడు తమతోనూ భాగస్వామ్యం కుదుర్చుకోవాలని యాపిల్ కు సత్య నాదెళ్ల ఆఫర్ ఇవ్వడం గమనార్హం.
AI ఛాట్ బోట్ లకు శిక్షణ ఇచ్చి..
ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (AI) ఛాట్ బోట్ లకు శిక్షణ ఇచ్చి, కీలకమైన కంటెంట్ ప్రొవైడర్‌లను బలోపేతం చేసేందుకు గూగుల్ తన సెర్చ్ ఇంజన్ గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని తాము ఆందోళన చెందుతున్నామని కోర్టుకు నాదెళ్ల వివరించారు. సెర్చ్ ఇంజన్ వ్యాపారంలో గూగుల్ గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తున్న మైక్రో సాఫ్ట్ సహా పలు కంపెనీలు అమెరికాలో ప్రస్తుత యాంటీ ట్రస్ట్ కేసును నడుపుతున్నాయి. ఈ పిటిషన్లపై వాషింగ్టన్ డీసీ కోర్టు విచారణ (Google Vs Satya Nadella) జరుపుతోంది.