Site icon HashtagU Telugu

MI vs SRH: సన్ రైజర్స్ ను చిత్తు చేసిన ముంబై… ఇక గుజరాత్ చేతిలో రోహిత్ సేన ప్లే ఆఫ్ బెర్త్

LSG vs MI

Mi Vs Srh Dream11 Prediction1684654801539

MI vs SRH: ప్లే ఆఫ్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన చివరి మ్యాచ్ లో ఓడితే ముంబై ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. కెరీర్‌లో తొలి ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన వివ్రాంత్ శర్మ అసాధారణ బ్యాటింగ్ తో చెలరేగాడు. మయాంక్ అగర్వాల్ సైతం ముంబై బౌలర్లపై విరుచుకుపడటంతో పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన వివ్రాంత్ శర్మ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఈ సీజన్‌లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మధ్యలో ఆకాశ్ మధ్వాల్ సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ వేశాడు. కీలక సమయాల్లో వరుస వికెట్లు పడగొట్టాడు. వివ్రాంత్ శర్మ 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69, మయాంక్ అగర్వాల్ 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 రన్స్ చేశారు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా…క్రిస్ జోర్డాన్‌కు ఓ వికెట్ దక్కింది.

బ్యాటింగ్ పిచ్ కావడంతో ముంబై ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. త్వరగానే ఓపెనర్ ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయినా…రోహిత్ శర్మ, కామెరూన్ గ్రీన్ అదరగొట్టారు. రోహిత్ తనదైన షాట్లతో అలరిస్తే…గ్రీన్ భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. సన్ రైజర్స్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోయారు. ముఖ్యంగా గ్రీన్ చెలరేగిపోయాడు. కేవలం 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అటు రోహిత్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా…ముంబై ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 128 పరుగులు జోడించారు. రోహిత్ 37 బంతుల్లో 8 ఫోర్లు , 1 సిక్స్ తో 56 రన్స్ చేయగా…గ్రీన్ , సూర్య కుమార్ యాదవ్ తో కలిసి ముంబై విజయాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో 8 ఫోర్లు , 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై 18 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. అయితే పాయింట్ల పట్టికలో బెంగుళూరు రన్ రేట్ ను అధిగమించలేక పోయింది. ఇప్పుడు బెంగుళూరు గుజరాత్ చేతిలో ఓడిపోతే ముంబై ప్లే ఆఫ్ చేరుతుంది.

Read More: IPL Playoff: ప్లే ఆఫ్ లెక్కలివే.. ఏ జట్టుకు ఛాన్సుందంటే..?

Exit mobile version