Usha Chilukuri Vance : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ఎంపికయ్యారు. వారిద్దరి పేర్లను అధికారికంగా ప్రకటించారు. జేడీ వాన్స్ సతీమణి పేరు ఉషా చిలుకూరి. ఈమె తెలుగు మూలాలు కలిగిన మహిళ. ఉషా చిలుకూరి పేరెంట్స్‌ది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు వద్ద ఉన్న చిన్న గ్రామం. కొన్ని దశాబ్దాల క్రితం వారు అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలో జన్మించిన ఉషా.. శాండియాగో ప్రాంతంలో పెరిగారు. అక్కడే ఆమె చదువుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
2013 సంవత్సరంలో యేల్ లా స్కూల్‌లో ఉష చదువుతుండగా జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా, పెళ్లిగా మారింది. లా కోర్సు పూర్తి కాగానే.. 2014లో వాళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. కెంటకీ నగరంలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఉష లా కోర్సుతో పాటు మోడర్న్ హిస్టరీ కోర్సులో ఎంఫిల్ కూడా చేశారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారుల పేర్లు.. ఇవాన్, వివేక్. కుమార్తె పేరు మిరాబెల్. కాలేజీ రోజుల్లో ఉషా చిలుకూరి(Usha Chilukuri Vance) డెమొక్రటిక్ పార్టీని సమర్థించేవారు. 2014లో ఆమె డెమొక్రటిక్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నారు. వామపక్ష, ఉదారవాద అమెరికా సమూహాలతో కలిసి పనిచేయడానికి ఉష ఆసక్తి చూపించేవారు. కొన్నేళ్ల క్రితమే ఉష డెమొక్రటిక్ పార్టీకి రాజీనామా చేసి.. రిపబ్లికన్ పార్టీలో చేరారు. తన భర్త తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆమె బలంగా సమర్ధిస్తుంటారు. జేడీ వాన్స్ కూడా తన ప్రతి విజయంలో ఉష పాత్ర ఉందని చెబుతుంటారు. ప్రస్తుతం ఉష అమెరికాలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరుగా రాణిస్తున్నారు. నేషనల్ లీగల్ ఏజెన్సీలో వ్యాజ్యకర్తగా (లిటిగేటర్) సేవలు అందిస్తున్నారు.
- ఉష భర్త జేడీ వాన్స్(JD Vance) మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు.
- జేడీ వాన్స్ రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా అమ్ముడు పోయింది. దానిపై సినిమా తీశారు.
- సాంకేతికత, ఆర్థిక రంగాల్లో జేడీ వాన్స్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్త.
- 39 ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్‌కు ఎన్నికయ్యారు.
- మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి జేడీ వాన్స్ చివరకు ట్రంప్‌కు విధేయుడిగా మారారు.