Deepa Joseph: అంబులెన్స్ నడుపుతూ.. కోవిడ్ రోగులను కాపాడుతూ!

మహిళలు టూవీలర్స్ నడపడం చాలా సర్వసాధారణం. కానీ భారీ వాహనాలను నడపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. పలు సందర్భాల్లో మగవాళ్లు సైతం ఇబ్బందులు పడుతుంటారు.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:37 PM IST

మహిళలు టూవీలర్స్ నడపడం చాలా సర్వసాధారణం. కానీ భారీ వాహనాలను నడపడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. పలు సందర్భాల్లో మగవాళ్లు సైతం ఇబ్బందులు పడుతుంటారు. డ్రైవింగ్ అంటనే చాలా కఠినమైంది. ప్రతి నిమిషం అలర్ట్ గా ఉండాలి. అలాంటి టఫ్ ఫీల్డ్ ను ఎంచుకుంది దీప జోసెఫ్ అనే మహిళ.

దీపకు పెళ్లై పిల్లలున్నారు. భర్త కారణంగా వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతిరోజు ఇబ్బందులు భరించలేక అత్తింటికి గుడ్ బై చెప్పేసి.. పిల్లలతో సహా బయటకు వచ్చేసింది. అయితే దీపాకు చిన్నప్పట్నుంచే డ్రైవింగ్ అంటే ఇష్టం ఉండటంతో అంబులెన్స్ డ్రైవర్ గా విధులు నిర్వహించడం మొదలుపెట్టింది. కేరళలో కొద్దిమంది మహిళా అంబులెన్స్ డ్రైవర్లలో దీప జోసెఫ్ ఒకరు. దీప తిరువనంతపురం నుంచి కోజికోడ్‌కు అంబులెన్స్ నడుపుతోంది. విధి నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరిస్తున్నందుకుగానూ దీపకు పద్మిని అవార్డు కూడా దక్కింది. ‘‘నాకు చిన్నతనంలో కూడా డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉన్న సమయంలో నేను డ్రైవింగ్ ఫీల్డ్ ను సెలక్ట్ చేసుకున్నా. ఇది జీవనోపాధికి మార్గంగా మారింది. 2016లో హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ పొందాను. అంతకు ముందు కుటుంబ పోషణ కోసం కోజికోడ్‌లోని రెస్టారెంట్లలో పనిచేశా’’ అని చెప్పింది దీప.

దీప ఓ మార్బుల్ షోరూమ్‌లో పనిచేసింది, అక్కడ డ్రైవర్ లేనప్పుడు వస్తువులను తీసుకెళ్లడానికి వాహనాన్ని తీసుకెళ్లడం ప్రారంభించింది. అదే సమయంలో బస్సు డ్రైవర్ అవసరమనే వార్త తెలుసుకుంది. దీప ట్రయల్ కోసం వెళ్లింది. మొదటి ప్రయత్నంలో వారికి నచ్చింది. ఉద్యోగం వచ్చింది. కాలేజీలో అమ్మాయిలను క్షేమంగా చేరవేసింది. అయితే కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. అంబులెన్స్ సర్వీసులకు డిమాండ్ ఉండటంతో డ్రైవర్ గా మారింది. కానీ ప్రభుత్వ అధికారులు అవకాశం ఇవ్వలేదు. ఓ సందర్భంలో సెక్యురిటీ గార్డు కొవిడ్ బారిన పడ్డాడు. దీంతో దీప స్పందించి క్షేమంగా ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పట్నుంచీ కోవిడ్ రోగులను ఆస్పత్రికి తరలిస్తోంది. ఈ క్రమంలో దీప మూడుసార్లు కరోనా బారిన పడింది. అయినా తన విధులను నిర్వహించడంలో వెనకడగు వేయలేదు.