Site icon HashtagU Telugu

Meerut: తప్పిపోయిన కమిషనర్ పెంపుడు శునకం.. 500 ఇళ్లల్లో గాలించిన పోలీసులు.. చివరికి?

Meerut

Meerut

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్‌లో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. నేరస్తులు చేసిన నేరాలను పోలీసులకు పట్టించడంతో పాటు, నేరాలను అదుపు చేస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు కుక్కను వెతికే పనిలో మునిగిపోయారు. అలా ఒక కుక్కను వెతకడానికి పోలీసులు దాదాపు 36 గంటలసేపు శ్రమ పడ్డారు. కుక్కను వెతకడానికి పోలీసులు కష్టపడడం ఏంటా అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే.. మేరఠ్‌ పోలీస్‌ కమిషనర్‌ సెల్వకుమారి పెంచుకునే పెంపుడు శునకం.

కాగా ఆ శునకం జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందినది. దాని పేరు ఎకో. ఆ జాతికి చెందిన కుక్కలు నగరంలో కేవలం 19 మాత్రమే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ శునకం తప్పిపోయిందట. దీంతో పోలీసు సిబ్బంది హుటాహుటిన కమిషనర్‌ నివాసానికి వెళ్లి ఆ ప్రాంతంలోని 500లకు పైగా ఇళ్లు గాలించారని కొన్ని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అంతేకాకుండా జంతువుల సంరక్షణాధికారి హర్పల్ సింగ్‌ సైతం కమిషనర్‌ ఇంటికి చేరుకుని, కుక్క ఫొటోను తీసుకుని వెతికడంతో ఈ ఘటన కాస్తా వివాదాస్పదంగా మారింది.

అయితే ఈ వార్తలను పోలీసు కమిషనర్‌ సెల్వకుమారి ఖండించారు. తమ శునకం కోసం పోలీసులు వెతకలేదని వెల్లడించారు. తప్పిపోయిన నా పెంపుడు కుక్క గురించి కొన్ని కథనాలు వస్తున్నాయి. గేట్‌ తెరచి ఉండటంతో అది బయటికి వెళ్లిపోయింది. మా నివాసానికి సమీపంలోనే అది తిరగడాన్ని గమనించిన కొందరు దాన్ని తిరిగి మా ఇంటికి తీసుకువచ్చారు. అంతేకాని దాన్ని ఎవరూ దొంగిలించలేదు. దాని కోసం పోలీసులు వెతకలేదు అని కమిషనర్‌ ట్వీట్‌ చేశారు.