Site icon HashtagU Telugu

Manipur Mantalu: దేశ సంపాదకుల వ్యాసాలతో ’’మణిపూర్ మంటలు‘‘ పుస్తకం

Manipur Situation

Manipur Is Burning Today

విభిన్నకులాలు విభిన్న మతాల భిన్నజాతుల సమాహారమైన విశాల భారతదేశాన్ని కులమతాల పేరున విభజన చేసి గద్దెన్నెక్కాలని చూసేవారిని తిప్పికొట్టవలసిన బాధ్యత పౌరసమాజంపైననే ఉందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డా.బండా ప్రకాశ్ అన్నారు. శుక్రవారం శాసనమండలి కార్యాలయంలో జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ’’మణిపూర్ మంటలు‘‘ అనే పుస్తకాన్ని డిప్యూటీ  చైర్మన్ బండా ప్రకాశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  140 కోట్ల మంది ప్రజల్ని తల్లికోడిలా రెక్కల క్రింద దాచుకోవలసిన కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో జరుగుతున్న అమానుష హింసాకాండకు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిగ్గదీశారు. వివిధ జాతుల సమాహారమన్న ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన నిరసించారు.

దేశాన్ని పాలించేవాళ్ళు అందరినీ సమంగా చూడాలి కాని ఎక్కువ తలలున్న గుంపు తక్కువ తలలున్న గుంపుగా విభిజించి అధికారం కోసం వికృత చేష్టలు చేయకూడదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన జాతులను అట్టడుగు వర్గాల వారిని ఉన్నత స్థాయికి తీసుకురావలసిన పాలకులే వివిధ జాతుల మధ్య విభజన రేఖలు గీయడం దారుణమన్నారు. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్న చైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతుంటే మనం మాత్రం ఇంకా నీదే కులం? నీదే మతమని చెప్పి మనుషుల్ని విభజన చేసే దగ్గరే ఆగిపోవటం దేశానికి తీరని నష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మతసామరస్యం అన్ని వర్గాల మధ్య సామరస్యమే దేశానికి రక్షగా నిలుస్తుందని అదే మన దేశ ప్రగతిని విశ్వవీధుల్లో సమున్నతంగా నిలబెడుతుందని ఆయన తెలిపారు. మణిపూర్ మంటలు లాంటి గాయాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తరం ఇలాంటి పుస్తకాలను అధ్యయనం చేయాలని చెప్పారు. దేశంలోని ప్రముఖులైన సామాజిక శాస్త్రవేత్తలు పత్రికా సంపాదకులు విశ్లేషకులు మణిపూర్ మంటలపై రాసిన వ్యాసాలను ఈ పుస్తకంలో కూర్పుచేయబడ్డాయని తెలిపారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణ మతసామరస్యానికి ప్రతీకగా దేశానికి మోడల్ గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.