Site icon HashtagU Telugu

Ponniyin Selvan: సమ్మర్ లో మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వం’ విడుదల..!!

Mani ratnam ponniyan selvan

Mani ratnam ponniyan selvan

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో అందరికంటే ముందువరుసలో ఉండే దర్శకుడు మణిరత్నం. ఆయనతో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అని అనుకోని హీరోగానీ, హీరోయిన్ గానీ ఉండదంటే… అతిశయోక్తి కాదు. మణిరత్నం తీసే సినిమాలన్నీ కూడా ఓ కళాఖండాలుగా అభివర్ణిస్తూ ఉంటారు సినీ లవర్స్. అసలు ఆయన ఎంచుకునే సబ్జెక్ట్స్ కానీ, ఆయన తెరకెక్కించే విధానం కానీ, మాటల్లో వర్ణించలేం. నాయక్, రోజా, గీతాంజలి, బొంబాయ్, సఖి… ఇలా చెప్పుకుంటూ పోతే, చాంతాడంత లిస్ట్ ఉంటుంది. తాజాగా డైరెక్టర్‌ మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వం’. గత యేడాది షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. భారీ తారాగణంతో ఈ సినిమాని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.

విక్రమ్‌, జయం రవి, కార్తీ, విక్రమ్‌ ప్రభు, జయరాం, పార్తిబన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఐశ్వర్యా రాయ్‌, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి లాంటి తారాగణంతో ‘కల్కి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కించారు. ఇక ఈ మూవీ కోసం గొప్పగొప్ప టెక్నీషియన్లు పనిచేశారు. వీరిలో ఎడిటర్‌ మను షాజు కూడా ఉన్నారు. ఈ సినిమా కోసం ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని షూట్‌ చేయగా, దాన్ని ఎడిటర్‌ ఎంతో నైపుణ్యంతో ఎడిట్‌ చేసి, దర్శకుడు మణిరత్నంకు చూపించారట. అది చూసిన మణిరత్నం కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారట. ఆ తర్వాత తేరుకున్న ఆయన మను షాజు ను ప్రత్యేకంగా అభినందించినట్టు తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు ఎడిటర్ మను షాజు. ఈ యుద్ధపోరాట సన్నివేశంలో భారీ తారాగణమంతా పాల్గొందని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సినిమాని సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయనున్నారు.