భాగ్యనగరంలో మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఈ ఏడాది టన్ను 70వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతోంది. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో మామిడి ధరలు అమాంతం పెరిగాయి. గతేడాదితో పోల్చితే నగరానికి సరఫరా భారీగా పడిపోయింది. దీంతో నాణ్యమైన మామిడిపండ్లు కిలో రూ.100 నుంచి 150వరకు పలుకుతోంది.
సాధారణంగా నగరంలోని మార్కెట్లకు 650నుంచి 700 ట్రక్కుల మామిడి పండ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల నుంచి మార్కెట్ కు సగటున 400లారీలు మాత్రమే వస్తున్నాయి. పంట ఆలస్యంగా చేతికి రావడంతోపాటు ఇతర కారణాల వల్ల మామిడి పండ్లు జూన్ నెల వరకు అందుబాటులో ఉంటాయని బాటసింగారం పండ్ల మార్కెట్ కమిటీ కార్యదర్శి సి నర్సింహా రెడ్డి చెబుతున్నారు. హయత్ నగర్ లోని కోహెడ్ ఫ్రూట్ మార్కెట్ సిద్దమయ్యే వరకు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కులో తాత్కాలికి మార్కెట్ ను ఏర్పాటు చేశారు.
అయితే బగానపల్లి, దశేహరి, కేసర్, హిమాయత్, తోపపురి వంటి రకాల పండ్లు రాష్ట్రంలో విరివిరిగా లభిస్తాయి. ఇవే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా మామిడి పండ్లు నగరానికి దిగుమతి అవుతాయి. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావం లాక్ డౌన్ నిబంధనల కారణంగా సరఫరా చాలా వరకు దెబ్బతింది. దానికి తోడుగా ఈ ఏడాది దిగుమతి భారీగా పడిపోయింది.
మామిడి పూతకు వచ్చే సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ సారి పంట దిగుబడి చాలా తగ్గింది. ఉదయం ఎండ, రాత్రివేళ్లో మంచు కురవడంతో మామిడి పిందె దశలోనే రాలిపోయిందని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరం వాతావరణ మార్పులు, చీడపీడలతో తోటలు దెబ్బతిని…ఏప్రిల్ రెండో వారంలో కూడా మామిడి మార్కెట్ పెద్దమొత్తంలో తరలిరాలేదని వ్యాపారులు చెబుతున్నారు.