Amaravati Avakaya Festival ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ‘ఆవకాయ అమరావతి ఉత్సవాలు’ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో చూడాలనుకునే వారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
- విజయవాడలో ‘ఆవకాయ అమరావతి’ ఉత్సవాలు
- జనవరి 8 నుంచి 10 వరకు కార్యక్రమాలు
- ఈ ఉత్సవాలకు ప్రవేశం ఉచితం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఆవకాయ అమరావతి ఉత్సవాలు విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్నాయి. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల్లో నృత్యం, కవిత్వం, సంగీతం, సినిమా సాహిత్యం వైభవం చాటిచెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ మూడు రోజుల ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఈ ఉత్సవాలకు ప్రవేశం ఉచితంగా కల్పిస్తున్నారు. కాగా, ఈ ఉత్సవాల్లో సంగీత, నాటక ప్రదర్శనలు, సినిమా–సాహిత్య చర్చలు, వర్క్‌షాపులు, ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, ఫుడ్ ఫెస్టివల్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో కూడా ఈ ఉత్సవాలను వీక్షించొచ్చు. దాని కోసం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏ రోజు ఏయే కార్యక్రమాలు జరుగుతాయంటే..
గురువారం (జనవరి 8) సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పున్నమిఘాట్‌లో ఆవకాయ అమరావతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. అనంతరం తోలు బొమ్మల ఊరేగింపు, తీన్‌మార్ డప్పులు ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత జామర్స్ సంగీతం, పున్నమి ఘాట్ ఘాట్ వద్ద హారతి, హౌస్‌బోటు ప్రారంభోత్సవం, శంఖం-నగారా-డ్రమ్స్ ప్రదర్శన ఉంటుంది.
శుక్రవారం (జనవరి 9న) భవానీ ద్వీపంలో.. సినిమాల్లో విలన్ పాత్రపై చర్చ ఉంటుంది. ఇందులో యండమూరి వీరేంద్రనాథ్, ఎస్ హుస్సేన్ జైదీ, సుధీర్ మిశ్ర వంటి ప్రముఖులు పాల్గొంటారు. ఆ తర్వాత భారతీయ పురాణాలు, పురోగమనంపై చర్చ జరుగుతుంది. ఇందులో కస్తూరి మురళీకృష్ణ, సంజీవ్ పస్రిచా, అనురాధ మోతాలి వంటి తదితరులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తారు. ఓటీటీ కాలంలో సినిమాలపై పడే ప్రభావం జరిగే చర్చలో పలువురు వక్తలు ప్రసంగిస్తారు.
చర్చలు ప్రసంగాలు మాత్రే కాకుండా.. మార్షల్ ఆర్ట్స్, నగాడా, బొమ్మల తయారీ, నృత్యంపై సదస్సులు నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం పున్నమిఘాట్‌లో కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్య నాటకం ఏర్పాటు చేశారు. అనతంరం సినిమాలో సంగీతం, కవిత్వంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అనిరుద్ వర్మ కలెక్టివ్, నిజామీ బంధుతో సంగీత ప్రదర్శన ఉంటుంది.
శనివారం (జనవరి 10న) భవానీ ద్వీపంలో తెలుగు కథన కళ, సినిమా- జర్నలిజం, తెలుగు సాహిత్యం- సినిమా వైభవం, అనువాద కళపై నిర్వహించే చర్చల్లో వక్తలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత పున్నమిఘాట్‌లో ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ ‘చౌరస్తా’ సంగీత ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ నటనా విశ్వరూపానికి నివాళి, ప్రేమ కథ సంగీత నాటకం, జావేద్ ఆలీ సంగీత కచేరి వంటి ప్రదర్శనలు ఉంటాయి.
