Site icon HashtagU Telugu

5 Star Hotel: బిల్లు చెల్లించకుండా 603 రోజులు 5 స్టార్ హోటల్ లో గడిపిన వ్యక్తి.. చివరికి?

Hotel Prices Hike

5 Star Hotel

మాములుగా ఫైవ్ స్టార్ హోటల్లో ఉండాలంటే ప్రతిరోజు డబ్బులు చెల్లించాల్సిందే. తినే తిండి నుంచి పడుకునే బెడ్ వరకు ప్రతి ఒక్కదానికి కూడా డబ్బులు చెల్లించాల్సిందే. ఒకవేళ డబ్బులు చెల్లించకపోతే వెంటనే ఆ హోటల్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 603 రోజులు డబ్బులు చెల్లించకుండా గడిపాడు. వినడానికి దానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఏరోసిటీలో రోజేట్‌ హౌస్‌ అనే ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఉంది.

దీంట్లో అంకుశ్‌ దత్తా అనే వ్యక్తి 2019 మే 30న ఒకరోజు నిమిత్తం చేరాడు. కానీ, దాన్ని ఆయన 2021 జనవరి 22 వరకు పొడిగించుకుంటూ వచ్చాడు. అలా నెల రెండు నెలలు కాదు ఏకంగా 603 రోజులు ఉన్నాడు. చివరకు బిల్లు చెల్లించకుండానే తప్పించుకున్నాడు. ఫలితంగా అతను రూ.58 లక్షలు హోటల్‌కు బకాయిపడ్డాడు. దీనికిగానూ హోటల్‌ సిబ్బందిలో కొంత మంది అంకుశ్‌ దత్తాకు సహకరించినట్లు హోటల్‌ ప్రతినిధి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు హోటల్‌ లాగిన్‌ సాఫ్ట్‌వేర్‌, అకౌంట్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు.

ఈ మేరకు నిందితుడు కొంత డబ్బు ఆశజూపి హోటల్‌ సిబ్బందితో కుట్రకు పాల్పడినట్లు తెలిపారు. వాస్తవానికి ఒక వ్యక్తి బిల్లు చెల్లించకుండా తన స్టేను 72 గంటలకు పైగా పొడిగించుకుంటే ఆ విషయాన్ని వెంటనే సిబ్బంది హోటల్‌ సీఈఓ, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌ దృష్టికి తీసుకెళ్లాలి. కానీ, ఈ విషయాన్ని ఎవరూ పై స్థాయికి తీసుకెళ్లలేదని సదరు వ్యక్తి వెల్లడించారు. వ్యవహారం మొత్తంలో హోటల్‌ చెకిన్‌ సాఫ్ట్‌వేర్‌ నిర్వహణలో కీలకంగా వ్యవహరించే ప్రేమ్‌ ప్రకాశ్‌ అనే ఉద్యోగి హస్తం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.

ఇతడు కావాలనే దత్తా బకాయి బిల్లులను ఇతర పెండింగ్‌ బిల్లులతో కలిపి రిపోర్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అలాగే నిందితుడికి అనుకూలంగా అనేక నకిలీ బిల్లులను సృష్టించినట్లు తెలిపారు. మధ్యలో అంకుశ్‌ మూడు సార్లు వరుసగా రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షలు విలువ చేసే చెక్కులను ఇచ్చినట్లు తెలిపారు. కానీ, అవి బౌన్స్‌ అయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని కూడా సిబ్బంది దాచి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో హోటల్‌ ప్రతినిధి పేర్కొన్నారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నేరం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ విషయంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version