మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ సమీపంలో 50 ఏళ్ల వ్యక్తిని పులి చంపిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి రఘునాథ్ ఉయికే గా అధికారులు గుర్తించారు. సగం తిన్న అవశేషాలు జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఛీతాపూర్ గ్రామ సమీపంలోని అడవిలో కనిపించాయని ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దినేష్ ఝరియా తెలిపారు. ఈ ప్రాంతం పెంచ్ టైగర్ రిజర్వ్‌లోని రుఖాద్ బఫర్ జోన్‌కు సమీపంలో ఉంది.
మృతుడు పశువులను మేపేందుకు మంగళవారం అడవిలోకి వెళ్లాడని, గత రాత్రి వరకు తిరిగి రాలేదని, దీంతో గ్రామస్థులు అతని కోసం వెతికారని తెలిపారు. బుధవారం ఉదయం స్థానికులు సగం మాయం అయిన శరీర భాగాలను గుర్తించి అటవీ శాఖకు సమాచారం అందించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని అధికారి తెలిపారు.