Site icon HashtagU Telugu

Maharashtra: మోడీకి ఓటు వేసిన వేలు తొలగించుకున్న వ్యక్తి.. రోజుకో అవయవాన్ని పంపుతానంటూ?

Maharashtra

Maharashtra

తాజాగా ఒక వ్యక్తి మోడీ ప్రభుత్వానికి ఓటు వేసిన వేలు నే తొలగించి సర్కారుకి బహుమతిగా పంపించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు వ్యక్తి అలా చేయడానికి వెనుక కారణాన్ని కూడా వెల్లడించారు. అంతేకాకుండా తనకు న్యాయం జరిగే వరకూ సర్కార్ కు రోజుకు ఒక అవయవాన్ని కట్ చేసుకొని పంపుతాను అంటూ వీడియోలో వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర కు చెందిన ధనుంజయ్ నానవరే తన సోదరుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా తన వేలునే నరుక్కున్నాడు. అలాగే తనకు న్యాయం జరిగే వరకు రోజుకొక్క అవయవాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తానని వీడియోలో తెలిపాడు.

అయితే అదంతా వీడియో తీశాడు. శుక్రవారం ఉదయం ధనుంజయ్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆగస్టు 1న ఆయన సోదరుడు నందకుమార్ నానావరే, ఆయన భార్య ఉర్మిళ ఒకరి తరువాత మరొకరు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ముందే వారు తమ సూసైడ్ కు కారణమైన వ్యక్తుల పేర్లును వీడియోలో రికార్డు చేశారు. మొత్తం తొమ్మిది మందిని పేర్లను వారు పేర్కొన్నారు. తన సోదరుడు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్నాడని తెలిపిన ధనుంజయ్, వారు ఆత్మహత్యకు మునుపు రికార్డు చేసిన వీడియోలో సంగ్రామ్ నికల్జే, అడ్వకేట్ నితిన్ దేశ్‌ముఖ్, గణపతి కాంబ్లే, రంజిత్ సింగ్ నాయక్ నింబాల్కర్ పేర్లు ప్రస్తావించారని తెలిపారు. తన సోదరుడికి పొరుగింటి వారితో ఉన్న కోర్టు కేసులను సెటిల్ చేసుకోవాలంటూ దేశ్‌ముఖ్ తనకున్న పరిచయాల ద్వారా ఒత్తిడి తెచ్చాడని కూడా వెల్లడించారు.

అయితే ఆ ఘటనకు ముందు రోజు తన సోదరుడు ఒక వ్యక్తికి ఏకంగా రూ.10 లక్షలు ట్రాన్సఫర్ చేసినట్టు కూడా గుర్తించానని చెప్పుకొచ్చారు ధనుంజయ్. నిందితులు పలుమార్లు తన సోదరుడి ఇంటికి వచ్చినట్లు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన విషయాన్ని ధనుంజయ్ ప్రస్తావించారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని వీడియోలో కోరారు. అలా జరగనంత వరకు రోజు ఒక అవయవాన్ని ముఖ్యమంత్రికి పంపిస్తానని పేర్కొన్నారు. ఫడ్నవీస్ అధికారంలో ఉండగానే ఇదెలా సాధ్యమైందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో ఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కలకలం రేగడంతో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. కాగా, బాధిత కుటుంబానికి నిందితులతో కొన్ని భూ లావాదేవీల సమస్యలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version