Aurangzeb Picture : మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టుకున్నాడనే ఆరోపణలపై నవీ ముంబై పోలీసులు ఒక వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబైలోని వాషి ప్రాంతంలో ఒక మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అవుట్‌లెట్‌లో పనిచేసే ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లాక.. నోటీసు ఇచ్చి వదిలేశారు. ఆ యువకుడు వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ గా ఔరంగజేబ్ ఫోటోను(Aurangzeb Picture) పెట్టుకున్నాడని ఓ వర్గానికి చెందిన సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టు జరిగిందని తెలిసింది. ఆ వ్యక్తి ప్రొఫైల్ పిక్చర్ కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఫిర్యాదుదారులు పోలీసులకు సమర్పించారు.
Also read : Trees: చెట్ల విలువను చాటిచెప్పే అసలైన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
దీంతో పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌లు 298 (మత భావాలను గాయపరిచే ఉద్దేశంతో మాట్లాడటం), 153-A (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఔరంగజేబ్, టిప్పు సుల్తాన్‌లను కీర్తించారనే ఆరోపణలపై ఇటీవల మహారాష్ట్రలోని వివిధ నగరాల్లో మతపరమైన ఉద్రిక్త ఘటనలు జరిగాయి. కొల్హాపూర్ నగరంలో టిప్పు సుల్తాన్ ఫోటోతో పాటు అభ్యంతరకరమైన ఆడియో సందేశాన్ని సోషల్ మీడియా “స్టేటస్”గా పెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నిరసనకారులు గత బుధవారం రాళ్లు రువ్వారు.