Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి!

  • Written By:
  • Publish Date - January 11, 2024 / 11:12 AM IST

వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని శ్రీ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది.

ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో R&B, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక పరిగి నియోజకవర్గం దామగుండం దేవాలయం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు. నేవి కమండర్ శ్రీ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసారు.

నేవి కమండర్ కార్తిక్ శంకర్ ‘లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్’ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. నావికాదళానికి చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్ దాస్, రాజ్ బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.