Site icon HashtagU Telugu

PM’s Security Lapse: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్ పై ‘మోడీ’ స్ట్రక్!

Modi Security

Modi Security

ఆయనో దేశ ప్రధాని.. ఏ చిన్న కార్యక్రమానికి హాజరైనా భారీ పోలీస్ భద్రత, వ్యక్తిగత సెక్యూరిటీ అండగా ఉంటుంది. క్షణ క్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో నిఘా వేస్తుంది. చీమ చిటుక్కుమన్న ఇట్టే తెలిసిపోతోంది. మొదటిసారి ప్రధాని మోడీ కాన్వాయ్ లో భద్రత లోపించింది. ఫలితంగా ఆయన దాదాపు 20 నిమిషాలపాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం బటిండాలో దిగిన ప్రధాని మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి వెళ్లనున్నారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించని కారణంగా రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. దీనికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. పంజాబ్ పోలీసు డిజిపి సిద్ధార్థ్ చటోపాధ్యాయ అవసరమైన భద్రతా ఏర్పాట్లను ధృవీకరించిన తర్వాత అతను రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డగించినట్టు గుర్తించారు. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ప్రధానమంత్రి షెడ్యూల్, ప్రయాణ ప్రణాళిక పంజాబ్ ప్రభుత్వానికి చాలా ముందుగానే అందింది. అయితే దేశ ప్రధాని పర్యటనలో భద్రత లోపించిందని, దీనికి పంజాబ్ ప్రభుత్వం బాధ్యత వహించాలని MHA డిమాండ్ చేసింది.