Site icon HashtagU Telugu

Maharashtra Bus Accident: మహారాష్ట్ర బస్సు ప్రమాదంపై పోలీసుల అనుమానం

25 People Died

25 People Died

Maharashtra Bus Accident: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు డివైడర్‌ను ఢీకొనగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 25 మంది ప్రయాణికులు చనిపోయారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు భయపడుతున్నాయి. ఈ ప్రమాదం వెనుక మానవ తప్పిదం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. టైర్ పగిలిపోవడంతో బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని డ్రైవర్ చెప్తుండగా.. డ్రైవర్ నిద్రమత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు భావిస్తున్నారు.

నాగ్‌పూర్ నుంచి పూణె వెళ్తున్న బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సింధ్‌ఖేడ్రాజా సమీపంలోని పింపాల్‌ఖుటా గ్రామంలో తెల్లవారుజామున 1.30 గంటలకు బస్సు ప్రమాదం జరిగింది, ఇందులో 25 మంది ప్రయాణికులు మరణించారు. బస్సు డ్రైవర్, క్లీనర్‌తో సహా మరో ఎనిమిది మంది పగిలిన కిటికీలోంచి బయటకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

రాత్రి భోజనం కోసం యవత్మాల్ జిల్లాలోని కరంజా వద్ద బస్సు ఆగింది. ఆ తర్వాత బస్సు ముంబై-నాగ్‌పూర్ హై-స్పీడ్ క్యారేజ్‌వేలో సింధ్‌ఖేడ్‌రాజా వరకు దాదాపు రెండున్నర గంటల్లో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీంతో బస్సు సగటు వేగం గంటకు 60-70 కి.మీ. అయితే స్పీడ్ సమస్య కాదని పోలీసు అధికారి తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఇది మానవ తప్పిదమేనని తెలుస్తోంది. అయితే బస్సు టైరు పగిలిపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, అయితే ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రమాదం అనంతరం డీజిల్‌ ట్యాంక్‌ పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి.

డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై టైరు పగిలి ప్రమాదం జరగలేదని, ఘటనా స్థలంలో రబ్బరు ముక్కలుగానీ, టైర్ గుర్తులు గానీ లేవని అమరావతి ప్రాంతీయ రవాణా కార్యాలయం నివేదిక పేర్కొంది.

Read More: Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్‌ లక్ష్యం.. విజ‌య‌వంతంగా జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మం