Site icon HashtagU Telugu

Covid : ముంబయిలో కొవిడ్‌ కలవరం

children corona covid

children corona covid

దేశంలో పలు రాష్ట్రాలు, నగరాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా ముంబయి నగరంలో గడిచిన 24 గంటల్లోనే 1765 కేసులు రికార్డయ్యాయి. జనవరి చివరి వారం తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ముందురోజుతో పోలిస్తే కేసుల సంఖ్య 42శాతం పెరగగా.. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 9శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది.

బుధ‌వారం ముంబయిలో 1242 కేసులు నమోదుకాగా గురువారం నాటికి కొత్తగా మరో ఐదువందల కేసులు పెరిగాయి. అంతేకాకుండా కొవిడ్‌ పాజిటివిటీ రేటు 9.19శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని బృహన్‌ముంబయి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ప్రజలను అప్రమత్తం చేసింది. కేవలం ముంబయి నగరంలోనే కాకుండా మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. నేడు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 2701 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాలు మాత్రం సంభవించలేదు. అయితే, నాలుగు నెలల తర్వాత ఈస్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ క్రియాశీల కేసుల సంఖ్య 10వేలకు చేరువయ్యింది.

మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.. మరిన్ని రాష్ట్రాల్లోనూ వైరస్‌ క్రమంగా ఉద్ధృతిని పెంచుకుంటోంది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 5233 కేసులు నమోదుకాగా పాజిటివిటీ రేటు 1.67శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 30వేలకు చేరువయ్యింది.

Exit mobile version