Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. గుండెపోటు రావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, జూన్ 8వ తేదీ ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తపై పలువురు రాజకీయ నాయకులు తమ స్పందన తెలియజేస్తుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… “జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం చెందడం బాధాకరం” అని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని గుర్తుచేశారు.
Tragedy: ఢిల్లీని కుదిపేసిన దారుణం.. బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక సూట్‌కేసులో శవమై
మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పదవిని చేపట్టి, యువతలో రాజకీయ చైతన్యం కలిగించడంలో తన వంతు పాత్ర పోషించారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆపై వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చురుగ్గా పాల్గొంటూ ప్రజల మద్దతు పొందారు. స్థానిక అవసరాలను గుర్తించి, ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేశారు.
మాగంటి గోపీనాథ్ మృత్యువు ఆ పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటుగా నిలుస్తుందని లోకేష్ అన్నారు. “మాగంటి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ లోకేష్ తన సందేశాన్ని ముగించారు. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లోను తీవ్ర విషాదం నెలకొంది. రాజకీయంగా ఆయన చూపించిన చురుకుదనం, ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని పలువురు భావిస్తున్నారు.
Fake Doctor: బయటపడ్డ నకిలీ కార్డియాలజిస్ట్ బాగోతం.. 50 గుండె ఆపరేషన్లు