Site icon HashtagU Telugu

Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…

Girl Rape Attempt

Girl Rape Attempt

Physical Harassment : ఆడవారిపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతూ భారతదేశాన్ని కలచివేస్తున్నాయి. పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.

తాజాగా, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి యత్నం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక పంపుల చెరువు కాలనీలో నివసించే బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. బాలికపై కొంతకాలంగా గంజాయి మత్తులో ఉంటున్న యువకుల గుంపు కన్నేసింది. రోజూ పాఠశాలకు వెళ్ళే బాలికను ఫాలో అవుతూ సమయం కోసం ఎదురు చూస్తున్న వారు, శనివారం ఆమెను ఒంటరిగా చూసి దాడి చేశారు.

నిందితులు బాలికను అపహరించి, కాళ్లు, చేతులు కట్టేసి పంపుల చెరువు వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ లైంగిక దాడి యత్నం చేయగా, బాలిక గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు, బంధువులు అప్రమత్తమయ్యారు. కేకలు వినిపించడంతో స్థానిక యువత పరుగెత్తుకుంటూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూస్తూనే నిందితులు పరారయ్యే ప్రయత్నం చేశారు. స్థానికులు వెంటపడుతూ ఒక నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు, మరొకరు పారిపోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తిని కూడా పోలీసుల గాలింపు చర్యల తర్వాత అదుపులోకి తీసుకున్నారు. లైంగిక దాడి యత్నానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనలో నిందితులు గంజాయి సేవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. గంజాయి మత్తులో ప్రతి రోజూ వీరు అల్లరి చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఘటన స్థానికంగా గంజాయి వ్యాపారం, వినియోగంపై తీవ్ర ఆగ్రహం రేపుతోంది. ఈ ఘటన తర్వాత స్థానికులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, గంజాయి ముఠాలను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నివారణ కోసం సమాజం సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలు ఇకముందు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టడం అత్యంత కీలకం.

Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్