T20 league: లక్నో టీమ్ కు ఎదురుదెబ్బ

ఐపీఎల్‌ 2022వ సీజన్‌ ప్రారంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ కు భారీ షాక్‌ తగిలింది.

  • Written By:
  • Updated On - March 14, 2022 / 12:07 PM IST

ఐపీఎల్‌ 2022వ సీజన్‌ ప్రారంభానికి ముందు కొత్త జట్టు లక్నో సూపర్ జాయింట్స్ కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌, ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్‌ మార్క్‌వుడ్‌ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.7.5 కోట్లు చెల్లించి మార్క్‌వుడ్‌ని లక్నో ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది.. అయితే వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టు తరఫున బరిలోకి దిగిన మార్క్‌వుడ్‌ బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో మ్యాచ్ మధ్యలోనే మైదానం నుంచి బయటికి వెళ్లిన మార్క్‌వుడ్ ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యాడు.. అయితే తాజాగా అతని గాయంపై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పందించింది. మోచేతి గాయంతో బాధపడుతున్న మార్క్‌వుడ్‌ తిరిగి కోలుకునేందుకు మరో 4 వారాల సమయం పట్టనున్నట్లు వెల్లడించింది..

అయితే ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న మార్క్‌వుడ్‌ దూరం కావడం లక్నో సూపర్ జాయింట్స్ ఫ్రాంచైజీకి గట్టి ఎదురుదెబ్బని చెప్పొచ్చు. ఇక మరోవైపు ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో లక్నో సూపర్‌జెయింట్స్‌ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కేఎల్‌ రాహుల్‌తోపాటు స్టోయినిస్, రవి బిష్ణోయిలను రిటైన్‌ చేసుకున్న లక్నో ఫ్రాంచైజీ ఆవేశ్‌ ఖాన్‌, జాసన్‌ హోల్డర్‌, కృనాల్‌ పాండ్యాను, డికాక్‌, దీపక్‌ హుడాలను కొనుగోలు చేసింది.