రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని కీలక ప్రాంతాల్లోకి రష్యా బలగాలు చొచ్చుకుని వెళ్ళాయి. ఈ క్రమంలో రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ప్రధానంగా దాడులు జరుగుతున్నాయి. రష్యాపై ఎదురుదాడికి నాటో దళాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉక్రెయిన్ వైపు అమెరికా యుద్ధ విమనాలు మోహరించింది.
రష్యా దాడిని ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్నా, చేతులెత్తేసే స్థితికి వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలను జనాలు వదిలి వెళ్తున్నారు. హైవేలపై ఎక్కడ చూసినా భయంతో తరలిపోతున్నారు. రష్యా దాడి నేపథ్యంలో కీవ్ నగరాన్ని ప్రజలు వీడుతున్నారు. తమ నగరంపై బాంబుల మోత మోగుతుండటంతో వేరే ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ఉక్రెయిన్ ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. దీంతో కీవ్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించడంతో, పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. అలాగే పెట్రోల్ బంకుల దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది.