అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 26వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం ఆయనకు నివాళులర్పించారు. ఆత్మగౌరవం, స్వయంపాలన పోరాటంలో ఎన్టీఆర్ ఉపయోగించిన ఆయుధాలు నిజాయితీ, నిస్వార్థం, నిర్భయ అని లోకేశ్ పేర్కొన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, నిజమైన సమానత్వ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ఇప్పుడు అవే ఆయుధాలను ఉపయోగించాలని ఆయన అన్నారు.
దొంగలు, దోపిడీదారులు, దురహంకార పాలకులు లేని సమాన, స్వేచ్ఛాయుత సమాజాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఉందని నారా లోకేష్ పేర్కోన్నారు. ఎన్టీఆర్ చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని..ఆయన ఆ సమయంలో చాలా క్లిష్టమైన సవాళ్లను విజయవంతంగా అధిగమించారని లోకేష్ తెలిపారు. ఏపీలో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని నారా లోకేష్ అన్నారు.ఆయన్నిఎప్పుడూ తెలుగువారి ముద్దు బిడ్డగా ప్రజలు పిలుచుకుంటారని.. తన కఠోర శ్రమ, పట్టుదలతో ప్రతి సవాళ్లను విజయంగా మార్చిన ఎన్టీఆర్ అందరికి స్ఫూర్తిగా నిలిచారని లోకేష్ తెలిపారు.