Site icon HashtagU Telugu

hand ball: హ్యాండ్‌బాల్‌ టీమ్‌కు లోక్‌సభ స్పీకర్‌ అభినందనలు

Game

Game

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ చాంపియ్‌న్‌షిప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత జటును లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా అభినందించారు. బుధవారం న్యూఢిల్లీలోని స్పీకర్‌ కార్యాలయంలో భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు, భారత ఒలింపిక్‌ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే, భారత హ్యాండ్‌బాల్‌ జట్టు సభ్యులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే వరల్డ్‌ చాంపియనషిప్‌లో కూడా పతకం సాధించాలని ప్లేయర్లకు స్పీకర్‌ సూచించారు. అంతకుముందు కర్నాల్‌ సింగ్‌ స్టేడియంలో భారత జట్టును జగన్‌మోహన్‌ రావు నేతృత్వంలోని హెచ్‌ఎఫ్‌ఐ ఘనంగా సన్మానించింది.

ఈ కార్యక్రమంలో ఐఓఏ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా తాము చేస్తున్న కృషికి తగిన ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. జట్టులోని ప్రతి క్రీడాకారిణి కూడా దేశానికి స్వర్ణం పతకం అందించాలనే కసి, పట్టుదలతో ఆడారని అభినందించారు. వారు చూపించిన అసమాన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని భార‌త‌ సీనియర్‌ మహిళలు, పురుషుల జట్లు కూడా భవిష్యత్‌ టోర్నీల్లో సత్తా చాటాలని జగన్‌ మోహన్‌రావు ఆకాంక్షించారు. ఇక, ఇటీవల కజకిస్థాన్‌లో ముగిసిన ఆసియా జూనియర్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌పై నెగ్గి భారత విజేతగా నిలిచిన విషయం విదితమే.

Exit mobile version