Site icon HashtagU Telugu

IPL: లివింగ్ స్టోన్ జాక్‌పాట్

Living Stone

Living Stone

ఐపీఎల్ మెగా వేలం రెండోరోజు కొనసాగుతోంది. తొలిరోజు వేలంలో భారత ఆటగాళ్ళ ఆధిపత్యం కనిపిస్తే… రెండో రోజు విదేశీ ఆటగాళ్ళ హవా మొదలైంది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో కీలకంగా ఉండే ఆల్‌రౌండర్లపై ఫ్రాంచైజీలు దృష్టిపెట్టాయి. దీంతో విదేశీ ఆల్‌రౌండర్లకు డిమాండ్ పెరిగింది. వేలంలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ లివింగ్ స్టోన్ జాక్‌పాట్ కొట్టాడు. టీ ట్వంటీ ఫార్మేట్‌లో మంచి రికార్డు ఉన్న లివింగ్ స్టోన్ కోసం ఆరు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన పోటీలో ఈ ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ను 11.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. లివింగ్ స్టోన్ గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే బబూల్‌లో ఎక్కువరోజులు ఉండలేక మధ్యలోనే టోర్నీ నుండి తప్పుకున్నాడు. మ్యాచ్ ఫినిషర్‌గా లివింగ్ స్టోన్ పేరు తెచ్చుకున్నాడు. షార్ట్ ఫార్మేట్‌కు సంబంధించి ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ రికార్డు బాగానే ఉంది. ఓవరాల్ కెరీర్‌లో 164 టీ ట్వంటీలు ఆడి 4 వేలకు పైగా పరుగులు చేయగా.. అందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి.

అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్‌లో 17 మ్యాచ్‌లు ఆడిన లివింగ్ స్టోన్ 285 పరుగులు చేశాడు. ఒక సెంచరీ కూడా సాధించాడు. అటు బౌలర్‌గానూ రాణిస్తుండడం వేలంలో లివింగ్‌స్టోన్‌కు బాగా కలిసొచ్చింది. అంతర్జాతీయ టీ ట్వంటీ కెరీర్‌లో 12 వికెట్లు పడగొట్టగా… ఓవరాల్ టీ ట్వంటీ కెరీర్‌లో 67 వికెట్లు తీసుకున్నాడు. ఈ కారణంగానే ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతని కోసం ఎగబడ్డాయి. ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఎంట్రీతో తమ బ్యాటింగ్ లైనప్‌ మరింత బలపడుతుందని పంజాబ్ యాజమాన్యం చెబుతోంది. ఇదిలా ఉంటే అలాగే సఫారీ బ్యాటర్ మర్క్‌రమ్‌ 2.6 కోట్లకు హైదరాబాద్ సొంతం చేసుకుంది. టీమిండియా క్రికెటర్ రహానే కోటి రూపాయల బేస్ ప్రైస్‌కు కోల్‌కతా దక్కించుకుంటే.. మణ్‌దీప్‌సింగ్ 1.1 కోట్లు , జయంత్ యాదవ్ 1.7 కోట్ల ధర పలికారు. ఇక విండీస్ క్రికెటర్ ఓడియన్ స్మిత్‌ కోసం కూడా గట్టిపోటీనే నడిచింది. ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో స్మిత్ బ్యాట్‌తోనూ రాణించాడు. దీంతో స్మిత్‌ను 6 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో మార్క జెన్సన్‌ను సన్‌రైజర్స్ 4.2 కోట్లు, శివమ్ దూబేను చెన్నై సూపర్‌కింగ్స్ 4 కోట్లకు , కృష్ణప్ప గౌతమ్‌ను లక్నో సూపర్‌జెయింట్స్ 90 లక్షలకు సొంతం చేసుకున్నాయి.