LIC Shares:ఎల్ఐసీ షేర్లు.. కొనచ్చా? అమ్మొచ్చా? ఆగొచ్చా?

కొన్నాళ్లుగా అందరి చూపులు ఎల్ఐసీ షేర్లపైనే. దాని ఐపీవో వచ్చేసింది.

  • Written By:
  • Publish Date - May 16, 2022 / 12:04 PM IST

కొన్నాళ్లుగా అందరి చూపులు ఎల్ఐసీ షేర్లపైనే. దాని ఐపీవో వచ్చేసింది. వాటాల కేటాయింపు కూడా పూర్తయ్యింది. కానీ మార్కెట్ డౌన్ లో ఉండడంతో ఇప్పుడా షేర్లను కొనాలా.. అమ్మాలా.. ఆగాలా అన్నదానిపై ఇన్వెస్టర్లలో కన్ఫ్యూజన్ ఉంది. రిటైలర్లు, పాలసీహోల్డర్లు.. ఈ రెండు విభాగాలు ఓవర్ సబ్ స్క్రైబ్ అయ్యాయి. అందుకే అప్లయ్ చేసిన షేర్ల కంటే తక్కువే వారికి వచ్చాయి.

ఐపీవోలో షేర్లు లభించనివారు.. లిస్టింగ్ సందర్భంగా వాటాలను కొనడానికి చూస్తున్నారు. కొంతమందికి ఇప్పటికే షేర్లు వచ్చినా.. మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని అమ్ముకోవడానికే చూడొచ్చు. ఒకవేళ లిస్టింగ్ నాడు కరెక్షన్ కాని వస్తే.. పెద్ద మొత్తంలో షేర్లు కొని.. దీర్ఘకాలానికి వాటిని ఉంచుకోవాలని కొందరు ఇన్వెస్టర్లు ప్లాన్ చేస్తున్నారు.

ఎల్ఐసీ ఇష్యూ గురించి ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు మార్కెట్లు 15 శాతానికి పైగా నష్టపోయాయి. ఇలాంటి సమయంలో ఎల్ఐసీ షేర్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సాధారణంగా చూస్తే.. ఈ సంస్థకున్న పేరు ప్రతిష్టల దృష్ట్యా లాభాలతో లిస్ట్ అవ్వాలి. కానీ మార్కెట్ లో ట్రెండ్ నెగటివ్ గా ఉండడంతో అవి కూడా నష్టాల్లోనే ఉంటాయేమో అని మరికొందరు అంచనా వేస్తున్నారు.

నిజానికి ఇష్యూ ధర రూ.949. కానీ రిటైలర్లకు రూ.45, పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ ఇచ్చింది ఎల్ఐసీ సంస్థ. అందుకే ఇది ఏమాత్రం ప్రీమియంతో లిస్ట్ అయినా.. ఇన్వెస్టర్లు వాటాలను అమ్ముకోవడానికి ఇష్టపడొచ్చు. దీనివల్ల స్టాక్ మార్కెట్ కు నష్టాలు తప్పవు. ఇలా కాకుండా షేర్ వేల్యూ.. రూ.900 దగ్గరలో లిస్ట్ అయితే మాత్రం.. వాటాదారులకు ఉపశమనం ఉంటుంది.

ఎల్ఐసీని లిస్టింగ్ రోజునే కొనాలా వద్దా అంటే.. నిపుణులు మాత్రం ఆగమంటున్నారు. ఎందుకంటే.. ఆరోజున స్టాక్ లో తీవ్ర ఒడిదొడుకులు తప్పవని చెబుతున్నారు.