Leopard: ఇటీవల తెలుగు రాష్ట్రాలో అటవీ జంతువుల సంచారం పెరిగింది. అంతేకాదు.. వీటి సంఖ్య కూడా పెరిగింది. దీంతో తరచుగా జనవాసాల్లోకి వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బరంగెడ్గి గ్రామంలో రైతుపై చిరుతపులి దాడి చేసింది. బాధితుడు వడ్ల విజయ్ కుమార్ మంజీరా నది ఒడ్డున తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా ఈ ఘటన జరిగింది.
చిరుత దాడి చేయడంతో, రైతు సహాయం కోసం అరిచాడు. దీంతో సమీపంలో పని చేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను తరిమికొట్టి కుమార్‌ను రక్షించారు. రక్తమోడుతున్న అతడిని బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అటవీ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు.