Politics: సోము వీర్రాజు చీప్ లిక్కర్ వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా సెటైర్లు..

  • Written By:
  • Updated On - December 29, 2021 / 03:30 PM IST

ఆంధ్రప్రదేశ్ లో తాము అధికారంలోకి వ‌స్తే ఆల్కహాల్ (లిక్కర్) క్వార్టర్ సీసాను రూ.50కే విక్రయించేలా చర్యలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రజా ఆగ్రహ సభలో మాట్లాడుతూ.. హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. బీజేపీకి అధికారం ఇస్తే నాణ్యమైన ఆల్క‌హాల్ అందుతుంద‌ని ప్రకటించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్ర‌ముఖ రాజకీయ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ లో దీనిపై సెటైర్‌లు వేశారు. నిన్న సోము వీర్రాజు మాట్లాడిన ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ‘వాహ్‌.. ఎంత గొప్ప‌ పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. బీజేపీ ఏపీ నైతిక‌త విష‌యంలో మ‌రింత దిగ‌జారింది. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధాన‌మా? లేదంటే బీజేపీకి రాజకీయంగా అవకాశాలు తక్కువగా ఉన్న‌ రాష్ట్రాలకు మాత్రమే బీజేపీ ఈ బంపర్ ఆఫర్ ఇస్తుందా?’ అని ఎద్దేవా చేశారు.

కాగా, దేశంలోని ఎన్డీయేత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు నేత‌లు కూడా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌ల‌పై చుర‌క‌లు అంటిస్తున్నారు. ఇంత గొప్ప ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌నున్న బీజేపీకి భ‌విష్య‌త్తులో ఇంకా ఎన్ని మంచి ఆలోచ‌న‌లు వ‌స్తాయో అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు కూడా సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక సామాజిక మాధ్య‌మాల్లో నెటిజ‌న్లు మీమ్స్ సృష్టిస్తూ ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను విప‌రీతంగా వైర‌ల్ చేస్తున్నారు.