Site icon HashtagU Telugu

Metro Rail: విశాఖలో మెట్రో రైలు.. ఏయే రూట్లలో?

Metro

Metro

విశాఖపట్నంలోనూ మెట్రో రైలు పరుగులు తీసే రోజులు ఎంతో దూరంలో లేవు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు దాదాపు రూ.14,309 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖ నగరంలో 76.9 కిలోమీటర్ల పరిధిలో 54 స్టాప్ లతో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈమేరకు అంచనాలతో సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) ను రూపొందించినట్లు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ యూ.జే.ఎం.రావు వెల్లడించారు. విశాఖ నగర భవిష్యత్ జనాభా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టు ఉంటుందని తెలిపారు. త్వరలోనే డీపీఆర్ ను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు.వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మొత్తం 3 కారిడార్లు ఉంటాయన్నారు.

స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు, తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ (చిన్న వాల్తేర్) వరకు ఈ మూడు కారిడార్లు విస్తరించి ఉంటాయని తెలిపారు. అయితే కేంద్ర సర్కారు నుంచి తుది అనుమతులు లభించేలోపు డీపీఆర్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. సాధ్యమైనంత త్వరగా మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని రాష్ట్ర సర్కారు భావిస్తోందని పేర్కొన్నారు.

Exit mobile version