Lalu Prasad Yadav: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు తీవ్ర అస్వస్థత

  • Written By:
  • Publish Date - February 22, 2022 / 10:07 AM IST

దాణా స్కామ్‌లో దోషిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాద‌వ్‌కు షాక్ ఇస్తూ, సోమ‌వారం రాంచీ స్పెష‌ల్ సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్షతో పాటు, 60 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే శిక్ష ఖరారైన కొద్దిసేపటికే లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స‌మాచారం. దీంతో లాలూ కుటుంబ సభ్యులు ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్ప‌త్రిలో చేర్పించారు.

ఈ క్ర‌మంలో అక్క‌డి వైద్యులు లాలూకు చికిత్స అందిస్తున్నారు. లాలూ ప్ర‌సాద్ మూత్ర‌పిండాల వ్యాధితో పాటు ప‌లు వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నారు. ప్రస్తుతం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌మాదం లేద‌ని అక్క‌డి వైద్యులు తెలిపారు. ఇక 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి 139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేశారని అభియోగాలు లాలూపై నమోదయిన సంగ‌తి తెలిసిందే. లాలూతో పాటు మరో 99 పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. దీంతో ఈ కేసులో భాగంగా 99 మంది నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయస్థానం ఈ ఏడాది జనవరి 29న లూలూను దోషిగా తేల్పింది. ఈ క్ర‌మంలో దాదాపు 25 ఏళ్ల తర్వాత దాణా కుంభకోణంలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి శిక్ష పడ‌డం గ‌మ‌నార్హం.