Jeevan Reddy: ఆర్మూర్ లోనే లక్ష మెజార్టీ.. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దే: జీవన్ రెడ్డి

  • Written By:
  • Updated On - April 25, 2024 / 04:22 PM IST

Jeevan Reddy: ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు అఖండ విజయం చేకూరుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాజిరెడ్డి గోవర్ధన్ విజయాన్ని కాంక్షిస్తూ ఆర్మూర్ లో గురువారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వంచకకాంగ్రెస్, రైతు ద్రోహి బీజేపీలకు శృంగభంగం తప్పదన్నారు. ఇక్కడి ఎంపీ అరవింద్ ఒక ఫాల్స్, ఫేక్,ఫ్రాడ్. పసుపుబోర్డు తేకుండా రైతులను నిలువునా ముంచిన వంచకుడు. ఎంపీగా ఆర్మూర్ కు నయా పైస పని చేయలేదు.

ఒక్క పేదవాడికి ఇల్లు కట్టివ్వలేదు. ఏనాడూ ప్రజలను కలిసిందిలేదు. వారి బాగోగులు చూసింది లేదు. అలాంటి సైకో అరవింద్ ను ఈ ఎన్నికల్లో తరిమికొట్టుడే. కోరుట్ల ప్రజలు అరవింద్ కు గట్టి బుద్ధి చెప్పారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డికి ఇక్కడ పనేమిటి?. జగిత్యాలలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా?. అసెంబ్లీఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బుట్ట దాఖల య్యాయి. గ్యారంటీలు,వారంటీలు పోయి ఇప్పుడు ఓట్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక బీఆర్ఎస్ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు. ప్రజలు,రైతులు,మహిళల్ని మోసం చేసినట్టే దేవుళ్లను కూడా మోసం చేస్తున్నరు. రైతుబంధు 15వేలకు పెంచలేదు. కేసీఆర్ అమలు చేసిన 10వేలు చాలామంది రైతులకు ఇవ్వలేదు.

కళ్యాణలక్ష్మీ లేదు. తులం బంగారం హామీ నెరవేర్చడం లేదు. గృహిణులకు ఇస్తామని హామీ ఇచ్చిన రూ. 2500 లేవు. రైతుల రుణమాఫీ గంగలో కలిసింది. కరెంట్ కోతలు ప్రజలకు వాతలు పెడుతున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. సాగునీళ్ళు లేక భూములు ఎండిపోయాయి. దీంతో ప్రజలు, రైతులు,మహిళలు ప్రభుత్వంపై చాలా కోపంతో ఉన్నరు. ఈ విధంగా అందరికి తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.