Meat: మటన్, చికెన్.. మేడ్ ఇన్ ల్యాబ్

ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను అమ్మేందుకు ఇటీవల సింగపూర్ ప్రభుత్వం అనుమతిచ్చింది.

  • Written By:
  • Updated On - May 1, 2022 / 05:09 PM IST

ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన చికెన్‌ను అమ్మేందుకు ఇటీవల సింగపూర్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో కృత్రిమ మాంసం వినియోగానికి అధికారికంగా అనుమతిచ్చిన మొదటి దేశంగా సింగపూర్‌ నిలిచింది.  కృత్రిమ పంది మాంసం, కృత్రిమ చికెన్, కృత్రిమ గొర్రె మటన్, కృత్రిమ బీఫ్, కృత్రిమ మిడతలు, కృత్రిమ కోడి గుడ్లు, కృత్రిమ సముద్ర నాచు, కృత్రిమ పుట్టగొడుగులు, కృత్రిమ ఆల్గే , కృత్రిమ పాలు, కృత్రిమ బెర్రీలను తయారు చేసే పరిజ్ఞానం అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. దానికి సంబంధించిన పరిశోధనలను అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్, ఫిన్ లాండ్, సింగపూర్, జపాన్ సహా ఎన్నో దేశాలు ఇప్పటికే ప్రారంభించాయి.

తాజా అప్ డేట్..

తాజాగా ఫిన్ లాండ్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకులు ఇందుకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు. ల్యాబ్ లలో తయారయ్యే కృత్రిమ మాంసం , కూరగాయలు, పాలు మానవ ఆరోగ్యానికి చాలా మంచివని తెలిపారు. సహజ మాంసం, కూరగాయలు, పాలల్లో ఉండే పోషకాలే వీటిలోనూ అదే స్థాయిలాంతయాని చెప్పారు. సహజంగానైతే కూరగాయలను సాగు చేసేందుకు భూమి కావాలి.. నీరు కావాలి.. ఎరువులు కావాలి.. కృత్రిమ కూరగాయల వల్ల ఇవేమీ అవసర లేని పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సహజ ఆహార ఉత్పత్తుల వాడకాన్ని మనిషి ఎంతగా తగ్గిస్తే.. వాతావరణంలోకి కర్బన ఉద్గారాల విడుదల అంతగా తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘ నేచర్ ఫుడ్ ‘ జర్నల్ లో ప్రచురితమైంది.

కృత్రిమ పాలు ఇప్పటికే రెడీ..

జంతువులతో ఏ మాత్రం సంబంధం లేకుండా పాలను తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది కొందరు అమెరికా శాస్త్రవేత్తలకు!! అంతే.. కొన్ని రకాల శిలీంద్రాలను ఉపయోగించి వాళ్ళు పాలను ఉత్పత్తి చేస్తున్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ రకమైన పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. పెర్‌ఫెక్ట్ డెయిరీ, ఇమాజిన్ డెయిరీ వంటి సంస్థలు ఇలాంటి కృత్రిమ పాలను తయారు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

కృత్రిమ మాంసం, చికెన్ రెడీ ..

మాంసం కావాలంటే ఎన్నో జంతువుల్ని పెంచాలి.. వాటిని పోషించాలి. ఈ తతంగం అంతా లేకుండా ఒక ఫ్యాక్టరీ పెట్టి.. అందులో జంతువుల పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావలసినంత మాంసం సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదేళ్లకిందటే ఈ ఐడియా వచ్చి ప్రయత్నాలు ప్రారంభించినా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో రీసెర్చ్ ఆపేశారు . 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ మాంసపు ముక్కని ల్యాబ్‌లో సృష్టించింది. అయితే దీని ధర చాలా ఎక్కువ. ఇజ్రాయిల్‌లోనే ఫ్యూచర్ మీట్ టెక్నాలజీస్ కంపెనీ చికెన్ ముక్కలను కృత్రిమంగా తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ కంపెనీకి ప్రతిరోజు 500 కేజీల కృత్రిమ చికెన్, మటన్, పంది మాంసం ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది.