Site icon HashtagU Telugu

KTR: పాతబస్తీలో కేటీఆర్ పర్యటన.. జనంతో మాట ముచ్చట

KTR Tweet

KTR Election Campaign

KTR: పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర శాదాబ్ ఓ రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. ఎలాంటి ప్రోటోకాల్‌ లేకుండా ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు సాదా సీదాగా వచ్చిన ఆయనను మెదట ఎవరూ గుర్తుపట్టలేదు.. కాని ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. ఎవరైనా మంత్రి వస్తే… మంత్రి వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది కాని.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి షాక్‌ అయ్యారు. ఆయన బిర్యానీతోపాటు.. పలురకాల హైదరాబాదీ వంటకాల రుచిచూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం.

మంత్రి కేటీఆర్ ను చూసిన పలువురు ఆయనను తమ టేబుల్ మీదికి ఆహ్వానించారు. మంత్రి రెండు కుటుంబాలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రితో మాట్లాడిన మైనార్టీ కుటుంబం హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని గంగాజమున తేహజీబ్ ను ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర నుంచి పర్యటనకు వచ్చిన మరో మైనార్టీ కుటుంబం మంత్రి కేటీఆర్ ని ప్రత్యేకంగా పలకరించారు. తమకు హైదరాబాద్ నగరం ఎంతగానో నచ్చిందని ఒకవైపు సాంప్రదాయ బద్ధమైన ప్రత్యేకతను కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికతను సంతరించుకున్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడాలన్న ఆలోచన తమకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారి పాపతో మంత్రి కాసేపు మాట్లాడారు. హైదరాబాద్ పట్ల ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

ఆ తర్వాత మరో టేబుల్ పైన ఉన్న హైదరాబాది యువతీ యువకులతో, పలువురు నడివయస్కులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మంత్రి కేటీఆర్ రాత్రి 11 గంటల సమయంలో తమతో పాటు సాధారణ వ్యక్తుల హోటల్లో ప్రత్యక్షం అవడంతో వారంతా ఆశ్చర్యాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారంతా మంత్రి కేటీఆర్ తో ముచ్చటించారు. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర ప్రగతి, ప్రస్తుత ఎన్నికల సందర్భంగా ఉన్న పరిస్థితుల పైన తమ అభిప్రాయాలను మంత్రితో పంచుకున్నారు. కచ్చితంగా హైదరాబాద్ నగర ప్రగతి ముందుకు ఇదే విధంగా పోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కొనసాగాలన్న బలమైన ఆకాంక్షను వారు వ్యక్తపరిచారు. కచ్చితంగా మీ నాయకత్వానికి ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. హోటల్ షాదాబ్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్… ముజం జాహి మార్కెట్ వద్ద ఉన్న ఫేమస్ ఐస్ క్రీమ్ కు చేరుకున్నారు. అక్కడ ఉన్న పలువురుతో మాట్లాడి, సితాఫల్, చీకు ఐస్ క్రీం రుచి చూశారు.

Exit mobile version